ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చిన యోగి ఆదిత్యనాథ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు యూపీ సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు.
సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించి యావత్ దేశ ప్రజలకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను యోగి ఆదిత్యనాథ్ అభినందించారు.
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులను కూడా యూపీ సీఎం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. జగద్గురు శ్రీ రామానుజాచార్యులు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీరాముల వారి దివ్య రూపాన్ని కూడా తిరుమలలో నేడు దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు.
