- ఫెస్టివల్ సీజన్లో సమస్య మరింత అధికం
- వరుస పండుగల నేపథ్యంలో ట్రాఫిక్‌పై పోలీసుల ఫోకస్
- జీడబ్ల్యూఎంసీ సహకారంతో ఆక్రమణల తొలగింపు, పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. వరంగల్లో వెహికల్స్ఫ్లో భారీగా పెరిగి, రోడ్లపై హైదరాబాద్ తరహా ట్రాఫిక్ కనిపిస్తోంది. ఓ వైపు ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమణలకు గురికావడం, మరోవైపు సెల్లార్లలో బిజినెస్‌లు నిర్వహిస్తూ వెహికల్స్ అన్నీ రోడ్లపైనే పార్కింగ్ చేయిస్తుండటంతో సమస్య తీవ్రమవుతోంది.
ఇక పండుగల సీజన్ వచ్చిందంటే నగర రోడ్లపై పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి నుంచి వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ పోలీసులు ట్రాఫిక్ సమస్యపై ఫోకస్‌పెట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ల కోఆర్డినేషన్‌తో రోడ్లపై ఆక్రమణలను తొలగించడంతోపాటు, ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
డైలీ దాదాపు 5 లక్షల వెహికిల్ ఫ్లో..
హనుమకొండ, వరంగల్ రెండు జిల్లాల కేంద్రాలు కావడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉండటంతో గ్రేటర్ వరంగల్ రోడ్లపై ఫుల్‌రష్ ఉంటోంది. ప్రతిరోజూ నగర రోడ్లపై దాదాపు 5 లక్షలకు పైగా వెహికల్స్ రాకపోకలు సాగిస్తున్నాయని పోలీసు ఆఫీసర్లు చెబుతున్నారు.
భారీగా వెహికల్స్ఫ్లో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హనుమకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వరంగల్ ఎంజీఎం సెంటర్, పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు అరగంట సమయం పడుతోందంటే నగర రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రోడ్లపైనే పార్కింగ్..
వరంగల్ నగరంలో పార్కింగ్ ప్లేసులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సిటీలోని ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్సులు, ఇతర భారీ బిల్డింగులు వెహికల్ పార్కింగ్ కోసం కేటాయించాల్సిన సెల్లార్లను ఇతర వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. ఆయా కాంప్లెక్సులకు వచ్చే వాహనాలను నడిరోడ్డుపైనే పార్కింగ్ చేయిస్తున్నారు. హనుమకొండలోని నక్కలగుట్ట, కాకాజీ కాలనీ, బస్టాండ్ ఏరియా, పద్మాక్షి టెంపుల్ లైన్ రోడ్లలో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది.
దీనికితోడు ట్రైసిటీవ్యాప్తంగా ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. మడికొండ నుంచి కాజీపేట, ఫాతిమానగర్, నిట్ క్యాంపస్, సుబేదారి, నక్కలగుట్ట, పెట్రోల్ పంప్, హనుమకొండ చౌరస్తా, బస్టాండ్ ఏరియా, అలంకార్, ములుగురోడ్డు, ఎంజీఎం సర్కిల్, పోచమ్మమైదాన్, మండిబజార్, వరంగల్ బస్టాండ్ ఇలా ఏ మార్గంలో చూసినా ఫుట్‌పాత్‌లు వ్యాపార అడ్డాలుగా మారాయి. దీంతో జనాలు నడిచేందుకు రోడ్లే దిక్కవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
పండుగలొస్తే మరింత రద్దీ..
పండుగల సీజన్ వచ్చిందంటే వరంగల్ నగరంలో వెహికల్స్ఫ్లో మరింత పెరుగుతోంది. వచ్చే వారం నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా రానున్నాయి. ఈ సమయంలో నగర రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ పంప్ నుంచి అలంకార్, ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం సెంటర్, బట్టలబజార్, వరంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ శ్వేత ఇటీవల జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, ట్రాఫిక్ పోలీసు ఆఫీసర్లతో ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మీటింగ్ నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. దీంతో పండుగలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ ట్రైసిటీవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జంక్షన్ల వద్ద బిజినెస్‌లతో ఇరుకుగా మారిన రోడ్లను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన షాపులను వెనక్కి జరిపిస్తున్నారు.
ఎక్కడికక్కడ పార్కింగ్‌కు ఏర్పాట్లు..
నగరంలో పార్కింగ్ ప్లేసుల సమస్య ఉండగా జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో జంక్షన్ల సమీపంలో అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ అశోక సెంటర్ ఎదురుగా ఉన్న స్థలాన్ని పార్కింగ్‌కు వినియోగించేలా చర్యలు చేపట్టారు.
వాస్తవానికి అక్కడ మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు ప్రారంభమయ్యే వరకు తాత్కాలిక పార్కింగ్ జోన్‌గా వినియోగిస్తున్నారు. చౌరస్తాలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న స్థలాన్ని కూడా వెహికల్ పార్కింగ్‌కు కేటాయించారు.
హనుమకొండ చౌరస్తాలో రోడ్లపై వాహనాలు నిలపకుండా ఏనుగులగడ్డ వద్ద ఉన్న మున్సిపల్ స్థలంలో పార్కింగ్ కోసం చర్యలు చేపడుతున్నారు. వరంగల్ చౌరస్తా సమీపంలో పార్కింగ్ జోన్ కోసం ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఆటోలను రోడ్లపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఆటోస్టాండ్ల ఏర్పాటుకు కూడా ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో పార్కింగ్ జోన్లను గుర్తించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
త్వరలోనే అందుబాటులోకి పార్కింగ్ జోన్లు..
వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సహకారంతో హనుమకొండ అశోక సెంటర్ వద్ద పార్కింగ్ జోన్ గుర్తించాం. కొన్నిచోట్ల రోడ్లపైనే బండ్లు పెట్టి దుకాణాలు నిర్వహిస్తుండటం సమస్యగా మారింది. అలాంటి వారికి ప్రత్యేకంగా వెండింగ్ జోన్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే నగరంలో పార్కింగ్ జోన్లు అందుబాటులోకి తెచ్చి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడతాం.
- టి.సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, వరంగల్-
