- ఏజెన్సీలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలి : తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ
- ఏటూరునాగారంలో ఆదివాసీల ర్యాలీ.. ఐటీడీఏ ఎదుట రాస్తారోకో
ఏటూరునాగారం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయడంతో పాటు ఐటీడీఏ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆదివాసీలతో కలిసి ములుగు జిల్లా ఏటూరునాగారంలో బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలని కోరారు.
ఏజెన్సీలోని ఉద్యోగాలను 100 శాతం గిరిజనులకే కేటాయించాలని, గోదావరి జలాలను ఏజెన్సీ ప్రాంతంలోని స్థానికులకు అందించాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు భూముల్లో ట్రెంచ్ తీయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తమ సమస్యలపై మంత్రి సీతక్క స్పందించాలని లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అనంతరం ఐటీడీఏ పీవోకు లెనిన్వత్సల్టొప్పోకు వినతిపత్రం అందజేశారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తుడుందెబ్బ ఏఎస్యూ అధ్యక్షుడు కొప్పుల రవి, జాతీయ అధ్యక్షుడు కొట్నక విజయ్, ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిశ బాలక్రిష్ణ పాల్గోన్నారు.
