న్యూఢిల్లీ, వెలుగు: సివిల్ జడ్జీ గోవింద లక్ష్మిపై విధించిన ‘నిర్బంధ పదవీ విరమణ’ చర్యను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆమెను తిరిగి విధుల్లో కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం సమర్థించింది. సివిల్ జడ్జీగా ఉన్న గోవింద లక్ష్మిని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పని చేస్తున్న సమయంలో ఆమెపై కొన్ని క్రమశిక్షణా ఆరోపణలు వచ్చాయి.
విచారణ తర్వాత ఆమెకు నిర్బంధ పదవీ విరమణ శిక్ష విధించారు. దీనిపై ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. కేవలం ప్రవర్తనా లోపాల ఆధారంగా ఇంత కఠినమైన శిక్ష విధించడం సరికాదంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారించిన సుప్రీం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
