కలియుగ వైకుంఠం తిరుమల మహా పుణ్యక్షేత్రం. తిరుమల అనగానే మహా రాజగోపురం గుర్తుకొస్తుంది. ఆలయంలోకి వెళ్లే ముందు.. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మహా రాజగోపురం నుంచి శ్రీవారిని మనసారా మొక్కుతారు.. స్మరించుకుంటారు. మహా రాజగోపురానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతుంది తిరుమల కొండ. ఈ బ్రహ్మోత్సవాల వేళ మహా రాజగోపురంపై కనిపిస్తున్న ఓ దృశ్యం భక్తులను కలవరపెడుతోంది. ఆలయ మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగినట్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం ఆలయానికి రంగులు వేసి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలోనే.. ఈ విరిగిన శ్రీకృష్ణుడి విగ్రహం స్పష్టంగా కనిపించడంతో టీటీడీ అధికారులు దీన్ని ఎలా గుర్తించలేకపోయారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అసలు ఈ విగ్రహం చేయి ముందే విరిగిందా..? మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టిన సమయంలో దెబ్బతిందా..? లేక చాలాకాలంగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారుల దృష్టికి రాలేదా..? అన్నది తేలాల్సి ఉంది.
సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ఆలయ పరిసరాల్లో అవసరమైన మరమ్మతులు, రంగుల పనులు చేపడతారు. అలాంటి సమయంలో మహా రాజగోపురంపై ఉన్న విగ్రహాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పుడు ఆ విధంగా ఇది వెలుగులోకి వచ్చినట్లు ఉంది. శ్రీవారి ఆలయ మహా రాజ గోపురంపై శ్రీకృష్ణుడి విగ్రహం చేయి విరిగినట్లు కనిపిస్తున్న వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. విగ్రహం ఎప్పుడు దెబ్బతింది..? దీనిపై మరమ్మతులు ఎప్పుడు చేపడతారు అనేది చూడాల్సి ఉంది.
