న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన ఐదు అంతస్తుల పీజీ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారం నాటికి ఏడుకు చేరింది. సహాయక చర్యలు రెండవ రోజుకు చేరుకోగా, శిథిలాల నుంచి ఇప్పటివరకు 12 మందిని రక్షించి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన భవన యజమాని హరిరామ్‌ను రాజస్తాన్‌లోని భివాడిలో పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉన్న ఈ బాయ్స్ పీజీ భవనం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బేస్‌మెంట్‌లో మరమ్మతులు జరుగుతుండగా కుప్పకూలింది. బేస్‌మెంట్‌లో నీరు నిలవడం (వాటర్ లాగింగ్) వల్లే ఈ నిర్మాణం బలహీనపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం రెండవ రోజు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.
బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొద్దిసేపటికే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ రాకేష్ కుమార్‌తో పాటు మరో నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతోపాటు నగరంలోని అన్ని ఐదు అంతస్తుల భవనాలను సీల్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కూలిన భవనానికి ఆనుకుని ఉన్న మరో ప్రమాదకర భవనాన్ని మూడు రోజుల్లోగా కూల్చివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించగా, పోలీసులు యజమానిపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ, ఆప్‌ల మధ్య రగడ
పీజీ భవనం కూలిన ఘటనపై బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర రాజకీయ వాగ్వాదం చెలరేగింది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నాయి. ఢిల్లీలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంలో, ప్రధాని మోదీ పారిస్‌లో ఆలయ ప్రారంభోత్సవంలో నిమగ్నమయ్యారని ఆప్ ఆరోపించింది. విద్యార్థుల హాస్టళ్ల కంటే బీజేపీకి పార్టీ కార్యాలయాలే ముఖ్యమని మండిపడింది.
ఈ ప్రమాదంలో బీజేపీ నేతల ప్రమేయం ఉందని, అందుకే మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు గుప్పించింది. ఆప్ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సత్య నికేతన్‌లో పెద్దఎత్తున ‘పీజీ మాఫియా’ నడుస్తోందని, చాలా మంది బీజేపీ ప్రముఖులకు ఇక్కడ ఆస్తులున్నాయని ఆరోపించారు.
7 లక్షల మందికి 8 వేల హాస్టల్స్ మాత్రమే..
ఢిల్లీలోని సత్య నికేతన్ పీజీ భవన ప్రమాదం నేపథ్యంలో దేశ రాజధానిలో విద్యార్థుల వసతి సదుపాయాల కొరతపై చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని వివిధ యూనివర్సిటీల్లో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, విద్యార్థులకు అందుబాటులో ఉన్న హాస్టల్ గదుల సంఖ్య కేవలం 8,000 మాత్రమేనని సమాచారం. డిమాండ్‌కు తగినన్ని అధికారిక వసతి గృహాలు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు అడ్డగోలు ఫీజులు
చెల్లిస్తూ ప్రైవేట్ పీజీలు, శిథిలావస్థకు చేరిన ప్రమాదకరమైన భవనాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
