అసెంబ్లీ నుంచి DMK ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్..

అసెంబ్లీ నుంచి DMK ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్..

తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర  గందరగోళం చెలరేగింది. ముఖ్యమంత్రి విజయ్ గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో నిరసన తెలుపుతున్న డీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.

 సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం విజయ్.. గత డీఎంకే పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి 7.5 నుంచి 10 శాతం వరకు డబ్బును పార్టీ ఫండ్ గా వసూలు చేశారని విమర్శించారు. అంతేకాకుండా, వీరానం నీటి పథకంపై సర్కారియా కమిషన్ నివేదికను, గతంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ అరెస్ట్ అయిన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

  సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించాలని డీఎంకే విప్ ఈవీ వేలు డిమాండ్ చేశారు. విజయ్ మాట్లాడిన విషయాలన్నీ ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారమేనని, అందులో తప్పేమీ లేదని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. సీఎం ప్రసంగం నుంచి ఎలాంటి వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

 స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు పోడియం ముందుకు దూసుకెళ్లారు. విజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ పెద్దగా  నినాదాలు చేస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు.

 స్పీకర్ ఎన్నిసార్లు హెచ్చరించినా, వారి సీట్లకు వెళ్లాలని సూచించినా డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభా నాయకుడు కేఏ సెంగోట్టయ్యన్ కోరిక మేరకు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి సభకు అడ్డు తగులుతున్న డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు పంపేయాల్సిందిగా స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్షల్స్ వారిని బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.