ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సోమవారం అకస్మాత్తుగా మూతపడింది. హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ఓ బృందం ప్రైవేట్ సందర్శనకు వచ్చినప్పుడు.. మహిళా ఉద్యోగులను దూరంగా ఉంచాలనే నిబంధన పెట్టడమే ఈ వివాదానికి కారణమైంది. గుజరాత్‌కు చెందిన బోచాసవాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ(BAPS) గురువుల సంప్రదాయాల ప్రకారం.. ఆయన మహిళల సమక్షంలో ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో BAPS ప్రతినిధులు ఈఫిల్ టవర్‌ను సందర్శించినప్పుడు, మహిళా సిబ్బందిని ఎవరికీ కనపడకుండా ఉండాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో ఈఫిల్ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్‌ఈటీఈ (SETE) మేనేజ్‌మెంట్ మహిళా ఉద్యోగులను వారి విధులను మార్చాలని, కొన్ని ప్రాంతాల్లో వారిని మగవారితో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమలింగం ఆధారంగా మహిళలను పక్కన పెట్టడం, వారిని అదృశ్యం చేయడంపై అక్కడి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులను లింగ వివక్షకు గురిచేయడాన్ని ఖండిస్తూ సోమవారం కార్మిక సంఘాలు భారీ సమ్మెకు దిగాయి. దీంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ ఒక్కసారిగా మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనపై ఫ్రాన్స్ రాజకీయ వర్గాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. "ఫ్రాన్స్‌లో మహిళలను ఎప్పుడూ తగ్గించుకోమని చెప్పలేం, ఏ మతం కూడా రిపబ్లిక్ చట్టాల కంటే గొప్పది కాదు" అని అక్కడి మంత్రులు స్పష్టం చేశారు. మహిళల ఉనికిని ఎవరూ పరిమితం చేయలేరని రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఇమ్మానుయేల్ గ్రెగోయిర్ ఈ ఘటనను ఆమోదయోగ్యం కాదని ఖండించి.. దీనిపై అధికారిక దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివాదంపై స్పందించిన మేనేజ్‌మెంట్ తాము చేసిన తప్పును అంగీకరిస్తూ.. ఇటువంటి షరతులను అంగీకరించి ఉండకూడదని బహిరంగంగా క్షమాపణలు కోరింది.
►ALSO READ | అమెరికాలో పెరిగిన ఇంధన ధరలు
వివాదం ముదరడంతో BAPS సంస్థ కూడా దిగివచ్చి అధికారికంగా క్షమాపణలు తెలిపింది. తమ పర్యటన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరుతూ.. పరస్పర గౌరవమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. సిబ్బంది సమ్మె కారణంగా సోమవారం రోజంతా మూతపడిన ఈఫిల్ టవర్, మంగళవారం నుంచి యథావిధిగా తెరుచుకుంటుందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌లో లౌకిక వాదం, స్త్రీ సమానత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
