బ్యాంకులో రెండున్నర కోట్లున్నాయ్.. లండన్‌లో రూ.77 లక్షల జాబ్ ఆఫర్‌పై డైలమాలో టెక్కీ

బ్యాంకులో రెండున్నర కోట్లున్నాయ్.. లండన్‌లో రూ.77 లక్షల జాబ్ ఆఫర్‌పై డైలమాలో టెక్కీ

బెంగళూరులోని ఓ చిన్న కన్సల్టెన్సీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 2లక్షలకు పైనే జీతం అందుకుంటున్నాడు 40 ఏళ్ల టెక్కీ. గత రెండేళ్లలో కష్టపడి సంపాదించిన రూ. 2కోట్ల 30 లక్షలు బ్యాంక్ సేవింగ్స్ ఉన్నాయట. తనకు పెళ్ళి కాలేదని, పిల్లలు లేరని, ఎలాంటి కుటుంబ బాధ్యతలు లేవని వెల్లడించాడు ఈ టెక్కీ. 

ప్రస్తుతం కంపెనీలో పెరుగుతున్న లేఆఫ్‌లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఇబ్బందికరంగా మారడంతో మరో రెండేళ్లలో తన ఉద్యోగం ఉంటుందనే నమ్మకం లేదంటున్నాడు టెక్కీ. సరిగ్గా ఇదే తరుణంలో లండన్‌లోని ఓ బ్యాంకు నుంచి అసోసియేట్ రోల్ కోసం రూ. 76.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ వచ్చిందట. పైథాన్, సీ++, గ్రాఫానా వంటి టెక్నాలజీలతో కూడిన ఈ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందని భావిస్తున్నానని అంటున్నాడు టెక్కీ. అయితే ఉద్యోగం కోసం లండన్ వెళ్లటంపైనే డైలమాలో పడ్డాడు. 

ఒకవైపు బెంగళూరులో ఉన్న ఉద్యోగం ఊడిపోతుందన్న భయం.. మరోవైపు లండన్ వెళితే అక్కడ భారీ పన్నులు, విపరీతమైన అద్దెలు, జీవన వ్యయం ఎలా ఉంటాయోనన్న భయం తనను డైలామాలో పడేశాయని చెప్పాడు రెడిట్ పోస్టులో. లండన్ వెళితే ప్రస్తుత సేవింగ్స్ రేటు పడిపోతుందని, అక్కడి ఖర్చులు తలకు మించిన భారమవుతాయని చాలామంది రెడ్డెట్ యూజర్లు హెచ్చరిస్తున్నారు. 60వేల యూరోల జీతంతో లండన్‌లో ఒంటరిగా బతకడం కష్టమని, సేవింగ్స్ పూర్తిగా తగ్గిపోతాయని సలహాలు ఇస్తున్నారు. ప్రొబేషన్ కాలంలో ఉద్యోగం పోతే విదేశాల్లో ఒంటరిగా ఎలా బతకాలనే ఆందోళన వెంటాడుతోందని వెల్లడించాడు.

తన దగ్గర ఉన్న రూ.2.3 కోట్ల సేవింగ్స్ తో భవిష్యత్తుపై కాస్త ధైర్యం ఉన్నప్పటికీ.. సొంత ఇల్లు లేకపోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత టైర్2 సిటీకి మారాలనే ఆలోచన కూడా ఉందని పేర్కొన్నాడు. ఉద్యోగ భద్రత కోసమే లండన్ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేయాలా? లేక భారత్‌లోనే ఉంటూ మరో మార్గం వెతుక్కోవాలా? అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాడు. విదేశీ ప్రయాణం తెచ్చిపెట్టే సవాళ్లు, ఆర్థిక నష్టాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. సో ఈ పరిస్థితుల్లో తనకు సరైన గైడెన్స్ ఇవ్వాలంటూ నెట్టింట ప్రజలను కోరాడు సదరు టెక్కీ.