ఇల్లు లేదు.. పిల్లలకు తిండి లేదు: నేపాల్‌‌‌‌ షెల్టర్ క్యాంపుల్లో కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు

ఇల్లు లేదు.. పిల్లలకు తిండి లేదు: నేపాల్‌‌‌‌ షెల్టర్ క్యాంపుల్లో కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు

ఖాట్మాండు: నేపాల్‌‌‌‌లో వరదల బీభత్సం తల్లుల జీవితాలను దుర్భరంగా మార్చింది. ఇండ్లు, ఆస్తులు కోల్పోయిన వేలాది కుటుంబాలు షెల్టర్‌‌‌‌ కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయి. అక్కడ చిన్నారులకు సరైన ఆహారం అందడం లేదు. దీంతో అక్కడ ఇచ్చే కఠినమైన ఆహారాన్నే తల్లులు పిల్లలకు, పెద్దలకు పెట్టాల్సి వస్తోంది. పిల్లలకు పాలిచ్చేందుకు కూడా సరైన, సురక్షితమైన చోటు లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. 

ఆగస్టు 26 నాటి వరదల్లో శర్మిలా శ్రేష్ఠ తన 14 నెలల కుమార్తెకు దూరమయ్యారు. కొండల్లో, బురద నిండిన ప్రాంతాల్లో, షెల్టర్లలో ఆమె రెండు, మూడు రోజులు వెతికివెతికి తన కూతురిని కలుసుకున్నారు. ప్రస్తుతం ఖాట్మాండు సమీపంలోని ప్రాంతంలో ఏర్పాటు చేసి షెల్టర్​లో కుమార్తెతో కలిసి ఉంటున్నారు. తన వదిన వరదల్లో గల్లంతవడంతో.. 18 నెలల ఆమె కొడుకును కూడా ఆమే చూసుకుంటున్నారు. ఈ ఇద్దరు పసివాళ్లకు పెట్టేందుకు ఆమెకు చిన్నారులకిచ్చే ఆహారం లభించడం లేదు. 

పెద్దలకు ఇచ్చే అన్నం, చారు, కూరల వంటి హెవీ ఫుడ్‌‌‌‌నే పిల్లలకు పెట్టాల్సి వస్తోంది. త్రిశూలి ప్రాంతంలో పారియార్‌‌‌‌ అనే మహిళ తన మూడు నెలల శిశువుతో షెల్టర్లో ఉంటున్నారు. కిక్కిరిసిన షెల్టర్‌‌‌‌లో పురుషుల మధ్యే ఆమె శిశువుకు పాలివ్వాల్సి వస్తోంది. అక్కడ సిగరెట్‌‌‌‌ పొగ, మద్యం వాసనతో బిడ్డ సరిగా నిద్ర కూడా పోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

నిరాశ్రయులైన గర్భిణులు

రాసువా, నువాకోట్‌‌‌‌, ధాదింగ్‌‌‌‌ జిల్లాల్లో నిరాశ్రయులైన దాదాపు 4,430 మంది గర్భిణులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్ఎఫ్‌‌‌‌పీఏ) తెలిపింది. నెల రోజుల్లో సుమారు 492 మందికి ప్రసవాలు జరిగే అవకాశం ఉందని.. వారిలో దాదాపు 74 మందికి ఎమెర్జెన్సీ మెటర్నిటీ కేర్ అవసరమయ్యే పరిస్థితి ఉందని తెలిపిందన్నారు. 

జాతీయ సంతాప దినం పాటించిన నేపాల్ వరద విషాదానికి 13వ రోజు కావడంతో హిందూ సంప్రదాయం ప్రకారం సంతాప దినంగా నిర్వహించారు. వరదల్లో మృతుల సంఖ్య 1,355కు చేరింది. 4,996 మంది గల్లంతయినట్లు గుర్తించారు.