హైదరాబాద్: రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు ఆకస్మాత్తుగా కుప్పకూలాడు. పరిస్థితిని గమనించిన మంత్రి వాకిటి వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన వ్యక్తికి CPR చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, బాధితుడిని వెంటనే అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి క్విక్ రెస్సాన్స్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇక, రెండో రోజు (సెప్టెంబర్ 8) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సభలో మాటల యుద్ధం నడిచింది. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా.. తమ పార్టీ సభ్యులు స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని హరీష్ రావు వివరణ ఇచ్చారు.
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా తమ ఎమ్మెల్సీ ప్రకటించారని హరీష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంత రాద్ధాంతం అవసరం లేదన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. స్పీకర్ పై అనుచితంగా మాట్లాడటమే కాకుండా.. అతి పెద్ద ఇష్యూనే కాదన్నట్లు మాట్లాడం ఏంటని మండిపడ్డారు.
