- ఉద్యోగుల అనుమానాలను తొలగిస్తం
- ఇస్రో ప్రైవేటీకరణపై సంస్థ చైర్మన్ నారాయణన్ క్లారిటీ
బెంగళూరు: ఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని ఆ సంస్థ చైర్మన్ వి. నారాయణన్ స్పష్టం చేశారు. దేశ అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికే ప్రైవేటు కంపెనీలతో పాటు స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇస్రోలో తయారీ, నిర్వహణ పనులను ప్రైవేటు రంగానికి మారుస్తున్నారనే వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత కోరుతూ తొమ్మిది ఉద్యోగ సంఘాలు చైర్మన్‌కు ఇటీవల లేఖ రాశాయి. ఈ క్రమంలో సోమవారం బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్‌పో కార్యక్రమంలో చైర్మన్ వి. నారాయణన్ స్పందించారు.
దేశ అంతరిక్ష ప్రయాణం దాదాపు 65 ఏండ్లు పూర్తి చేసుకున్నదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సామాన్యుల అవసరాల కోసం 56 ఉపగ్రహాలు అంతరిక్షంలో సేవలు అందిస్తున్నాయని గుర్తుచేశారు. అయితే, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాటిలైట్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆరేండ్ల క్రితం వచ్చిన అంతరిక్ష సంస్కరణల ద్వారా ప్రైవేటు రంగానికి చేయూతనందిస్తున్నామని చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగాలకయ్యే ఖర్చులో దాదాపు 80 శాతం మేర భారతీయ పరిశ్రమలకే వెళ్తోందని, ప్రస్తుతం సుమారు 450 పరిశ్రమలు ఇస్రో కోసం పనిచేస్తున్నాయని వివరించారు.ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనలు సహజమైనవేనని..వారి అనుమానాలను తొలగించే బాధ్యత తమపై ఉందని నారాయణన్ భరోసా ఇచ్చారు.
దేశ అవసరాల నిమిత్తం భవిష్యత్తులో ఏడాదికి దాదాపు 50 ప్రయోగాలు (లాంచ్‌లు) చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తాను 43 ఏళ్ల క్రితం ఇస్రోలో చేరినప్పుడు మూడేండ్లకు ఒక ప్రయోగం జరిగేదని.. నేడు ఆ పరిస్థితి మారి వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల అనుమానాలను తొలగించేందుకు వారితో చర్చలు జరుపుతామని వి. నారాయణన్ పేర్కొన్నారు.
