హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 73 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. వాటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.699.89 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో 164 రిలీజ్ చేశారు. గత నెల 10న ‘ప్రతిపాదనల దశలోనే పబ్లిక్ స్కూళ్లు’ అనే హెడ్డింగ్ తో వెలుగు దినపత్రికలో కథనం ప్రచురితమైంది. రాష్ట్రంలో క్యూర్ పరిధి బయట 94 పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించారు. ఈ నేపథ్యంలో పరిపాలన అనుమతులు ఇస్తూ తాజాగా సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతను టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో సింహభాగం అప్పు రూపంలోనే సేకరిస్తున్నారు. మొత్తం నిధుల్లో 70 శాతం అంటే రూ.489.92 కోట్లు ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి లోన్ తీసుకోనుండగా.. మిగిలిన 30 శాతం అంటే రూ.209.96 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటా నిధులను సర్కారు ఇప్పటికే విడుదల చేసింది. పారదర్శకత కోసం ఈ-టెండర్ల విధానం ద్వారా పనులు చేపట్టాలని జీవోలో స్పష్టం చేశారు.
ఒక్కో స్కూల్ డెవలప్మెంట్ కోసం కనిష్టంగా రూ.5 కోట్ల నుంచి గరిష్టంగా రూ.12.50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. కాగా.. అత్యధికంగా నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఐదు చొప్పున, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మ హబూబాబాద్, సిద్దిపేట, జనగామ, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాల్లో రెండు చొప్పున, ఆదిలాబాద్, ములుగు, హన్మకొండ, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కోటీకి పరిపాలన అనుమతులు లభించాయి.
