- సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుదాం
- ఈ నెల 10న చలో హైదరాబాద్‌ను సక్సెస్ చేయాలి: మారం జగదీశ్వర్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండు ఉద్యోగుల జేఏసీలు ఒక్కటయ్యాయి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.. ఉద్యోగుల జేఏసీలో విలీనమైంది. వేర్వేరు జేఏసీలుగా కాకుండా ఐక్య వేదికగా కలిసి ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని ఇరు సంఘాల నేతలు నిర్ణయించారు. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఈ నెల 10న ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ సభపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశం తర్వాత లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు ఉద్యోగుల జేఏసీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రెండు జేఏసీలు కలవడం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుభ పరిణామమని, లచ్చిరెడ్డికి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. రెండు జేఏసీలు ఏకమవడాన్ని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, హమీద్ స్వాగతించారు.
