తిర్యాణి, వెలుగు : తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల గ్రామ ఆదివాసీలు పాదయాత్ర చేపట్టారు. సోమవారం ఉదయం గుండాల నుంచి 40 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ కు చేరుకొని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకులు దౌలత్ రావు మాట్లాడుతూ తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణులను డోలీల్లో మోసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, ఆఫీసర్లు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
