అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు:  హైకోర్టు 

 అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు:  హైకోర్టు 

 

  • రూల్స్‌‌ మీరిన సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌‌‌‌కే ఉంది.. పోలీసులకు లేదు:  హైకోర్ట

హైదరాబాద్, వెలుగు: శాసనసభ నిబంధనలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌‌కే ఉంటుందని, పోలీసులకు ఆ అధికారం లేదని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోరాదని ఆదేశించింది. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై ఈ నెల 21న నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై వివరణ  ఇవ్వాలని హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్, డీసీపీ, సైఫాబాద్ ఏసీపీ, స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌‌పై జస్టిస్ టి.మాధవీదేవి సోమవారం అత్యవసరంగా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌‌రావు వాదనలు వినిపించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని, కొందరితో దురుసుగా ప్రవర్తించారని కోర్టుకు తెలిపారు. ఓ మహిళా ఎమ్మెల్యేను అడ్డుకుని చీర లాగారని, మాజీ హోం మంత్రి అయిన మరో మహిళా ఎమ్మెల్యే మెడపై చేయి వేశారన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నినాదాలతో కూడిన నల్లటి టీ షర్టులు ధరించిన ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో కొందరికి గాయాలయ్యాయని, వారికి డాక్టర్లు ట్రీట్‌‌మెంట్‌‌ అందించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. టీషర్ట్‌‌లు ధరించడం, నినాదాలు చేయడం వంటి అంశాలు అసెంబ్లీ నిబంధనలకు సంబంధించినవైతే వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌‌కే ఉంటుందని పిటిషన్‌‌ న్యాయవాది గండ్ర మోహన్‌‌రావు తెలిపారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని అభ్యర్థించారు. 

రూల్స్‌‌ ప్రకారం సభ్యులు బ్యాడ్జీలు ధరించొద్దు..

రాష్ట్ర హోం శాఖ తరఫున న్యాయవాది మహేశ్‌‌ రాజే వాదనలు వినిపిస్తూ.. శాసనసభ నియమావళి ప్రకారం సభ్యులు బ్యాడ్జీలు ధరించరాదని, స్పీకర్ అనుమతి లేకుండా జెండాలు, చిహ్నాలు, ఇతర ప్రదర్శన వస్తువులను సభలో ప్రదర్శించరాదని తెలిపారు. నల్లటి టీషర్ట్‌‌లపై నినాదాలు ఉండటంతో పోలీసులు అడ్డుకుని ఉండవచ్చని పేర్కొనగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుని చీరలు ధరించి వెళుతున్న మహిళా ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వారి మెడపై చేతులు వేసి గెంటాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు.

పూర్తి వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. వాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోరాదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.