భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌‌‌‌పోర్టు .. సాధ్యాసాధ్యాలపై ఏఏఐ బృందం పరిశీలన

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌‌‌‌పోర్టు .. సాధ్యాసాధ్యాలపై ఏఏఐ బృందం పరిశీలన

భద్రాద్రికొత్తగూడెం/ సుజాతనగర్​, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఏఏఐ) మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం సోమవారం పర్యటించింది. రెండు రోజుల పర్యటనలో సుజాతనగర్‌‌‌‌, సీతంపేట, చాపరాలపల్లి, చుంచుపల్లి తదితర ప్రాంతాలను పరిశీలించింది. 

అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కలెక్టర్‌‌‌‌ అంకిత్‌‌‌‌తో బృందం సమావేశమైంది. ఏటీఆర్‌‌‌‌-72తో పాటు ఎయిర్‌‌‌‌బస్‌‌‌‌ ఏ320, ఏ321 వంటి పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా 2,500 నుంచి 2,700 మీటర్ల రన్‌‌‌‌వే, భవిష్యత్‌‌‌‌ విస్తరణ, నైట్‌‌‌‌ ల్యాండింగ్‌‌‌‌, భద్రతా సదుపాయాలపై చర్చించారు.

 ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలోని రైల్వే లైన్‌‌‌‌ను కూడా బృందం పరిశీలించింది. అప్రోచ్‌‌‌‌ ఫన్నెల్‌‌‌‌ పరిధిలో రైల్వే మార్గం వచ్చే అవకాశాలపై సాంకేతిక ప్రభావాలను అధ్యయనం చేసింది. అవసరమైతే షీల్డింగ్‌‌‌‌ ద్వారా అవరోధాన్ని అధిగమించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.

 ప్రతిపాదిత స్థలాల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, రెవెన్యూ మ్యాపులు, భౌగోళిక కోఆర్డినేట్లు, హద్దులు, అప్రోచ్‌‌‌‌ రోడ్డు తదితర రికార్డులను బృందం పరిశీలిస్తోంది. రెండు రోజుల పర్యటన అనంతరం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఎయిర్‌‌‌‌పోర్టు ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎంపీ రఘురామిరెడ్డి పేర్కొన్నారు.