ఇంగ్లాండ్ వైట్‌‌బాల్‌‌ జట్లకు మెంటార్‌‌గా పీటర్సన్‌‌

ఇంగ్లాండ్ వైట్‌‌బాల్‌‌ జట్లకు మెంటార్‌‌గా పీటర్సన్‌‌

లండన్‌‌: ఇంగ్లండ్‌‌ వైట్‌‌బాల్‌‌ జట్లకు ప్రత్యేక మెంటార్‌‌గా మాజీ ఆల్‌‌రౌండర్‌‌ కెవిన్‌‌ పీటర్సన్‌‌ను నియమించారు. ఆఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ  వన్డే వరల్డ్‌‌ కప్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌‌ నుంచి హెడ్‌‌ కోచ్‌‌ బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌తో కలిసి పీటర్సన్‌‌ పనిచేయనున్నాడు. మార్కస్‌‌ ట్రెస్కోథిక్‌‌, టిమ్‌‌ సౌథీ, జీతన్‌‌ పటేల్‌‌, సారా టేలర్‌‌ కోచింగ్‌‌ బృందంలో పీటర్సన్‌‌ కూడా భాగం కానున్నాడు.

 ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌‌, న్యూజిలాండ్‌‌తో జరిగే సిరీస్‌‌లతో పాటు వరల్డ్‌‌ కప్‌‌ వరకు పీటర్సన్‌‌ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నాడు. ‘2014 తర్వాత ఇంగ్లండ్‌‌ జెర్సీ ధరించడం గొప్ప గౌరవం. సౌతాఫ్రికాలో వరల్డ్‌‌ కప్‌‌ గెలవడానికి నా వంతు సహకారం అందిస్తా. మెకల్లమ్‌‌ ఆలోచనల్లో భాగం కావడం అద్భుతం అవకాశం’ అని పీటర్సన్‌‌ పేర్కొన్నాడు. కెవిన్‌‌ రాకతో బ్యాటర్లలో మరింత నైపుణ్యం పెరుగుతుందని మెకల్లమ్‌‌ అన్నాడు. 

 పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌‌లో ఇంగ్లండ్ తరఫున 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌‌లు ఆడిన పీటర్సన్ 5,500లకు పైగా పరుగులు చేశాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు సాధించాడు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌‌గా పనిచేశాడు. సౌతాఫ్రికాలో ఆడిన  పీటర్సన్ అనుభవం, ఆఫ్రికా పిచ్‌‌లపై ఆయనకు ఉన్న అవగాహన రాబోయే ప్రపంచ కప్‌‌లో ఇంగ్లండ్ జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.