మెదక్ టౌన్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉద్యోగుల హక్కుల సాధన సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు విడతల కరువు భత్యం(డీఏ) పెండింగ్‌లో ఉందని, వాటిని ఒకే దఫాలో విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు అవసరాలకు ఉపయోగపడక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు, జేఏసీ జిల్లా చైర్మన్ నరేందర్, రాష్ట్ర ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, గజేందర్, అనిల్, మధుసూదన్‌రెడ్డి, సోమయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, సంగారెడ్డి పాల్గొన్నారు.
