లక్నో: ఓ ఆరేండ్ల చిన్నోడు ఏడాది నుంచి జమచేసుకున్న తన కిడ్డీ బ్యాంక్‌లోని పొదుపునంతా నేపాల్ వరద బాధితులకు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. నేపాల్‌లో వరదల విధ్వంసం చూసి చలించిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాకు చెందిన అల్ఫాజ్ షేక్.. తన పిగ్గీ బ్యాంకులో దాచుకున్న రూ.20 వేల మొత్తాన్ని బాధితులకు పంపించాడు.
టీవీలో, సోషల్ మీడియాలో వీడియోలు చూసి చలించిపోయిన అల్ఫాజ్.. ఈ నెల 3న తన తాతతో కలిసి పిగ్గీ బ్యాంకును పట్టుకుని కుషినగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లాడు. దాన్ని కలెక్టర్‌కు ఇచ్చి, డబ్బును నేపాల్ వరద బాధితులకు పంపించాలని కోరాడు.
దీంతో.. ఇంత చిన్న వయసులోనే బాలుడిలో కలిగిన ఆలోచనను చూసి కలెక్టర్‌తోపాటు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. సాయం ఎంత మొత్తం అనేదానికంటే.. చేసేవాళ్ల మనసే ముఖ్యమని కొనియాడారు. పిల్లాడి కోరిక మేరకు ఆ మొత్తాన్ని తీసుకుని అధికారులు నేపాల్ బాధితులకు పంపించారు.
