న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన చారిత్రాత్మక ‘భారత్ జోడో యాత్ర’ సోమవారానికి నాలుగేండ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఈ యాత్రకు సంబంధించిన పలు విశేషాలను గుర్తు చేసుకుంది. ‘భారత్ జోడో యాత్ర’ దేశ రాజకీయాల్లో కొత్త ఆశలను నింపిన ఒక నిర్ణయాత్మక మలుపు అని అభివర్ణించింది. ఈ పాదయాత్ర కేవలం ‘మన్‌కీ బాత్’ చెప్పడానికి కాదని, ప్రజల కష్టాలు, ఆందోళనలను స్వయంగా వినడానికి చేపట్టిన మహా ప్రయాణమని స్పష్టం చేసింది.
ప్రధాన ఉద్దేశం ఏంటంటే..
భారత్ జోడో యాత్ర నాలుగేండ్లు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌ను సందర్శించిన అనంతరం రాహుల్ గాంధీ మరో 120 మందితో కలిసి ఈ పాదయాత్రను ప్రారంభించారని గుర్తుచేశారు.‘‘కన్యాకుమారిలో మొదలై145 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 4,080 కిలోమీటర్లు సాగి, శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభతో ముగిసిన ఈ పాదయాత్ర సమకాలీన భారత రాజకీయాల్లో ఒక మలుపు.
దేశంలో ఆర్థిక అసమానతలు, రాజకీయ నిరంకుశత్వంపై ఆందోళన చెందుతున్న కోట్లాది మంది భారతీయులు ఈ యాత్రకు మద్దతు పలికారు.రాజ్యాంగ సూత్రాలు, పద్ధతులపై ఆర్‌ఎస్ఎస్, బీజేపీ సాగిస్తున్న దాడులను సైద్ధాంతికంగా ఎదుర్కోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం” అని ఆయన పేర్కొనారు. ‘‘భారత్ జోడో యాత్ర నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండటంతో కోట్లాది మంది భారతీయులతో నేను కూడా ఏకమవుతున్నాను. కోట్లాది మంది భారతీయులను ఈ యాత్ర ఒక్కతాటిపైకి తెచ్చింది’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు.
