హక్కుల కోసం బాధ్యతల విస్మరణ సమంజసమేనా..?

హక్కుల కోసం బాధ్యతల విస్మరణ సమంజసమేనా..?

ఈ దేశంలో  ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. కానీ విధుల గురించి మాట్లాడేవారు ఎంతమంది?  మనకు ప్రభుత్వ పథకాలు కావాలి,  రోడ్డు కావాలి, ఉద్యోగం కావాలి,  న్యాయం కావాలి, ఉచిత విద్య, వైద్యం కావాలి. ఇవన్నీ హక్కులు. మరి వీటిని  కాపాడుకోవడం  కోసం మనం ఏం చేస్తున్నాం? అని ఒక్కసారి ఆలోచించాలి.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకచోట ఇలా అన్నారు  ‘ఒక  సమాజం  బానిసత్వంలో ఉండటానికి కారణం ఆ సమాజం తన బాధ్యతను విస్మరించడమే’ అని.

నేడు మన సమాజం అదే స్థితిలో ఉంది.  వీధిలో  పేరుకుపోయిన చెత్తకు మున్సిపాలిటీ కారణం అంటాం,  బడి మానేసిన పిల్లాడికి ప్రభుత్వం కారణం అంటాం, మహిళపై  జరిగిన అత్యాచారానికి పోలీసుల భద్రతా వైఫల్యం కారణం అంటాం. కానీ సమాజ బాధ్యతను విస్మరిస్తున్న మనమే దుష్పరిణామాలకు కారణం కాదా? అని ప్రశ్నించుకోం.
 
భారత రాజ్యాంగం ప్రతి  పౌరుడికి  హక్కులను ఇచ్చింది.  కానీ  హక్కులతోపాటు అధికరణం ‘51ఏ’లో 11 ప్రాథమిక విధులను  కూడా  విధించింది.  మనం హక్కుల కోసం  గొంతు చించుకుని అరుస్తున్నాం,  కానీ విధుల విషయంలో  మాత్రం  మౌనం వహిస్తున్నాం.  ఇదే నేటి సామాజిక  సంక్షోభానికి మూల కారణం.  సమాజం అంటే  ప్రభుత్వం కాదు.  సమాజం  అంటే  మనం అందరం.  మన ఇంటిముందు రోడ్డు గుంత పడితే  ప్రభుత్వాన్ని తిట్టడం సులువు.

కానీ ఆ గుంతలో  చెత్త వేయకుండా ఉండటం,  ట్రాఫిక్ నియమాలు పాటించడం మన బాధ్యత అని మరచిపోతున్నాం. సామాజిక బాధ్యత అంటే హిమాలయాలంత త్యాగం కాదు, అది మన రోజువారీ ప్రవ ర్తనలో ఉండే చిన్న నిజాయితీ.  రాజ్యాంగంలోని  ప్రాథమిక విధులు కేవలం చట్టంలోని అక్షరాలు కావు,  అవే సామాజిక బాధ్యతలకు కొలమానం. 

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యత: రాజ్యాంగం పుస్తకం కాదు, అది మన ఆత్మ.  దాన్ని కాపాడాల్సింది  ప్రజలమైన మనమే. రాజ్యాంగాన్ని చదవడం, పిల్లలకు బోధించడం,  కుల, మత, లింగ బేధం చూపకుండా సమానత్వాన్ని  ఆచరించాలి.  మతం పేరుతో వచ్చే విద్వేషాన్ని అడ్డుకొని లౌకికవాదాన్ని కాపాడాలి. రాజ్యాంగ విలువలు గుండెల్లో ఉంటే  ఏ శక్తీ దాన్ని చంపలేదు.

దేశ ఐక్యత  బాధ్యత:  దేశ ఐక్యత అంటే సరిహద్దులను  కాపాడటం మాత్రమే కాదు,  మనసులను కలపడం.  భారతదేశం అనేక కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం.  ఈ వైవిధ్యంలోనే  మన ఏకత్వం ఉంది.  కులం, మతం పేరుతో  విద్వేషం రెచ్చగొట్టేవారిని ప్రశ్నించడం,  పక్క మతం,  పక్క భాషవారిని గౌరవించడం మన బాధ్యత.  మనం  విడిపోతే  దేశం బలహీనమవుతుంది,  కలిస్తేనే  బలపడుతుంది.

 పర్యావరణం, విపత్తులలో బాధ్యత:  పర్యావరణం మన తల్లిలాంటిది.  చెట్లు నరకడం, కొండలను ధ్వంసం చేయడం, నీటిని, గాలిని కలుషితం చేయడం వల్లే వరదలు, కరువులు, భూకంపాలు వస్తున్నాయి.  ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటడం,  నీటిని వృథా చేయకపోవడం,  ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండటం,  విపత్తు  వచ్చినప్పుడు కులం, మతం చూడకుండా ఒకరికొకరు సాయం చేయడం మన బాధ్యత.  ప్రకృతిని కాపాడితేనే  ప్రకృతి మనల్ని కాపాడుతుంది.

 ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత:  బస్సులు, రైళ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు ఎవరివో కాదు,  మన ఆస్తులు. ఇవన్నీ మన పన్నులతోనే నిర్మించినవి.  కోపం వచ్చినప్పుడు బస్సులు తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అంటే మన ఇంటిని  మనమే తగలబెట్టుకున్నట్టు. వాటిని సొంత ఆస్తుల్లా చూసుకోవడం, శుభ్రంగా ఉంచడం, నష్టం చేసేవారిని అడ్డుకోవడం మన విధి.

నేరాల,  ప్రమాదాల  నియంత్రణ  బాధ్యత:  నేరాలను  పోలీసులు మాత్రమే ఆపలేరు,  సమాజమంతా కలిస్తేనే ఆగుతాయి.  ప్రతి పౌరుడు నైతిక విలువలు కలిగి ఉండటం, నేరం చేయకుండా ఉండటమే బాధ్యత. అలాగే ప్రమాదం అంటే విధి కాదు,  నిర్లక్ష్యం ఫలితమే.  రోడ్డు ప్రమాదాలు,  అగ్నిప్రమాదాలు,  పరిశ్రమల ప్రమాదాలు చాలావరకు నియమాలు పాటించకపోవడం వల్ల మాత్రమే జరుగుతాయి.  నిర్లక్ష్య ధోరణి వదిలి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నియంత్రించవచ్చు.  ఒక చిన్న జాగ్రత్త  కొన్ని ప్రాణాల్ని కాపాడుతుంది.

శాస్త్రీయ దృక్పథం పెంపొందించే బాధ్యత:  ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని రాజ్యాంగం చెబుతోంది.  శాస్త్రీయ దృక్పథం అంటే సైన్స్ చదవడం కాదు,  ప్రతి విషయాన్ని ‘ఎందుకు?  ఏమిటి?  ఎలా?’ అని ప్రశ్నించడం.  శాస్త్రీయంగా ఆలోచించే సమాజమే అభివృద్ధి చెందుతుంది.

 పిల్లల భవితవ్య  బాధ్యత:  నేటి బాలలే  రేపటి పౌరులు. ఒక పిల్లవాడు బడి మానేసి పనికి వెళుతుంటే,  బాల్య వివాహం జరుగుతుంటే.. మనకెందుకులే అని వదిలేయడం నేరం.  ప్రతి బడి మానేసిన పిల్లాడిని తిరిగి బడికి చేర్చడం, బాల కార్మిక వ్యవస్థను అడ్డుకోవడం,  పిల్లలకు రాజ్యాంగ విలువలు నేర్పడం, చెడు మార్గంలోకి వెళుతున్న పిల్లాడిని  సరిదిద్ది మంచి మార్గంలో  పెట్టడం కూడా సామాజిక బాధ్యతే.

 అసమానతలు తొలగించడంలో బాధ్యత:  స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా కులం, మతం, లింగం, డబ్బు పేరుతో అసమానతలు కొనసాగుతున్నాయి.  ఎక్కువ, -తక్కువ అనే భావన మన మనసుల్లో నుంచి పోయి, మనుషులందరూ సమానమే అని అనుకున్నప్పుడే  అసమానతలు తొలుగుతాయి.  డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ‘సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం నిలబడదు’.  

 దేశ సమగ్ర అభివృద్ధి బాధ్యత:  దేశ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు, ప్రతి పౌరుడు సమానంగా ఎదగడమే.  పన్నులు సక్రమంగా కట్టడం, అవినీతిని ప్రశ్నించడం, ఓటును బాధ్యతగా వాడటం, అందరికీ విద్య, వైద్యం అందేలా సహకరించడం నిజమైన అభివృద్ధి.  ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.  కానీ సమాజం మారాలంటే  పౌరుడు మారాలి.  రాజ్యాంగం మనకు ఇచ్చిన 11 ప్రాథమిక విధులే 11 సామాజిక బాధ్యతలు.  సామాజిక బాధ్యత అనేది ఎవరో చెప్పితే వచ్చేది కాదు, అది నీ బాధ్యత, నా బాధ్యత. మనందరి బాధ్యత.  ఇది  గుర్తిస్తేనే  అంబేద్కర్ కలలు కన్న ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ ఉన్న భారతం సాధ్యమవుతుంది.

- ఎం. రవీందర్​
స్టేట్​ జనరల్​ సెక్రటరీ (టీమ్) 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.