భూతల, గగనతల, సముద్రతలాల్లో నిఘా అత్యవసరంగా మారిన కాలమిది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణాత్మక స్థితి కారణంగా ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియనిస్థితి నెలకొంది. దీంతో భారత ప్రభుత్వం త్రివిధ దళాలను, డజనుకు పైగా నిఘా విభాగాలను, గూఢచార సంస్థలను నిరంతరం అప్రమత్తం చేస్తూ, ఆధునికీకరిస్తూ.. సాయుధ బలగాల సాహసానికి సాంకేతికతను అనుసంధానం చేస్తోంది. అంతరిక్ష పరిశోధనారంగం కొత్తపుంతలు తొక్కుతున్నకొద్దీ...నిఘా నేత్రాన్ని నింగిలోకి పంపాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దశాబ్దాల నిరంతర కృషి తర్వాత మన శాస్త్రవేత్తలు గగనతలంపైకి నిఘా నేత్రాన్ని పంపారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి నిఘా ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4న విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. శ్రీహరి
కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా చేపట్టిన ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ‘షార్’ ఖాతాలోకి మరో కలికితురాయి చేరింది.
వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించడం, కీలక ప్రాంతాల్లో మార్పులను గుర్తించడం వంటి రక్షణ అవసరాలకు ఉపగ్రహం నుంచి అందే చిత్రాలు ఉపయోగపడనున్నాయి. అదే సమయంలో వరదలు, తుపాన్లు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభావిత ప్రాంతాలను వేగంగా గుర్తించేందుకు ఈఓఎస్-05 డేటా దోహదపడనుంది. సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర ప్రణాళికలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినప్పటికీ వాటిని ఇట్టే పసిగట్టే సత్తా ఈవోఎస్-05 ఉపగ్రహానికి ఉంది.
పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద వంటి వివరాలను హైపవర్, మల్టీ స్పెక్ట్రల్స్ కెమెరాలు సులువుగా గుర్తిస్తాయి. భారత ఉపఖండం మొత్తాన్ని 10 నిమిషాలకోసారి ఫొటో తీసే EOS-05 ఉపగ్రహాన్ని.. దాని భిన్నమైన పనితీరు కారణంగా ‘నాటీ బాయ్’గా పేరు సంపాదించుకున్నది. వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచడానికి ఇది ఎంతో కీలకం కానున్నది. అనేక వైఫల్యాల తర్వాత బహుళ అవసరాల నిమిత్తం భూమిని నిశితంగా పరిశీలించే తొలి భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ఇస్రో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. భూమికి 36,000 కి.మీ. ఎత్తులోని జియోసింక్రనోస్ కక్ష్యలో స్థిరపడే ఈ ఉపగ్రహం నిరంతరం కీలక సమాచారం సేకరిస్తుంది.
60వ దశకం నుంచే అమెరికా గూఢచార ఉపగ్రహ పరిశోధనలు
చైనా ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. సాగర గర్భం నుంచి అంతరిక్షం వరకూ గూఢచర్యాన్ని తీవ్రం చేసింది. బ్రిటన్ నేవీ ఉపయోగించే అత్యాధునిక డ్రోన్లు సేకరించే సమాచారం నేరుగా చైనాలోని నిఘా సంస్థల ఐపీ అడ్రస్‌లకు చేరడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా, జపాన్, తైవాన్ సహా అనేక యూరోపియన్ దేశాలు చైనా వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అరవయ్యో దశకం ఆరంభం నుంచే గూఢచార ఉపగ్రహ పరిశోధనలు చేస్తోంది.
మరోవైపు ఉగ్రదేశం
పాకిస్థాన్ ‘ఇస్లామిక్ దేశాల నాటో’ గురించి పదేపదే మాట్లాడుతోంది. ఇటీవలే పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మక్కాలో సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి పరస్పరం సహాయం చేసుకుంటాయి. ప్రస్తుతం ఈ రక్షణ వ్యవస్థలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మాత్రమే వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి.
అయితే భవిష్యత్తులో ఇతర దేశాలను కూడా చేర్చుకునే అవకాశం ఉంది. ముస్లిం దేశాలు ద్వైపాక్షిక, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సామూహిక భద్రత కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ అంటోంది. మక్కా రక్షణ ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు తుర్కియే అధునాతన డ్రోన్లను సరఫరా చేస్తోంది. జేఎఫ్-17 వంటి యుద్ధవిమానాలు, యుద్ధనౌకలను పాకిస్థాన్ సరఫరా చేస్తోంది. చైనా మద్దతుతో పాకిస్థాన్ గడిచిన పదహారు మాసాల్లో 16 భూ పరిశీలన ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది.
రక్షణ, నిఘా, గూఢచార వ్యవస్థల పటిష్ఠం
ఇలాంటి తరుణంలో భారత ప్రభుత్వం అన్ని రక్షణ, నిఘా, గూఢచార వ్యవస్థలను ఆధునికీకరిస్తూ పటిష్ఠం చేస్తోంది. భూతలం, సముద్రతలం నుంచి రణరంగం నింగిలోకి మారిన కాలంలో మన గగనతలాన్ని శతృ దుర్భేద్యంగా మార్చడం, భూతల రక్షణకు సరికొత్త సాంకేతికతను సమన్వయం చేయడం, సముద్ర గర్భంలో పహారాను తీవ్రం చేయడం అనివార్యంగా మారింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రళయాలు, విలయాలు పూడ్చలేని నష్టాలను మిగులుస్తున్నాయి. మరోవైపు పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశాలు అదనుకోసం ఎదురు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రక్షణ, భద్రతా రంగాలను పరిపుష్టం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. గగనతలం, సముద్రతలంపై రక్షణ వ్యవస్థలను నిర్మించడం కష్టసాధ్యమైన లక్ష్యాలు. భారతదేశం ఇప్పుడు మహాసముద్రాలే కేంద్రంగా పటిష్ఠమైన నిఘా, రక్షణ, గూఢచర్య వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్మిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనారంగం ఏటా కొత్త ఆవిష్కరణలు చేస్తూ.. రక్షణ రంగానికి ఇరుసుగా మారింది. భూగోళంపై మారుమూల ప్రాంతాలను నిరంతరం గమనిస్తూ త్వరితగతిన సమాచారాన్ని అందించే ఉపగ్రహాలు నేడు రక్షణ, విపత్తు నిర్వహణ విభాగాల్లో అత్యవసర సాధనాలయ్యాయి.
ఉపగ్రహాలే పహారా సాధనాలుగా..
చిట్టడవులు, పర్వత శ్రేణులు, సుదూర సముద్ర తీరాల్లో నిఘా తప్పనిసరి అయిన సందర్భంలో ఉపగ్రహాలే పహారా సాధనాలుగా మారాయి. తుపానులు, అల్పపీడన ద్రోణులు తాలూకు సమాచారాన్ని ముందే చేరవేయడం వల్ల నష్టనివారణ చర్యలు మరింత మెరుగవుతాయి. దావాగ్నులు, బడబాగ్నుల ప్రమాద తీవ్రతను ముందే అంచనా వేయవచ్చు. వ్యూహాత్మక అవసరాల విషయంలో భారత ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు క్రమ పద్ధతిలో సిద్ధం చేస్తోంది.
పదాతిదళాల సంచారానికి, ఆయుధ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు సముద్రతలంపై నిఘాకోసం అత్యాధునిక జలాంతర్గాములను ఒక్కొక్కటిగా ప్రోది చేసుకుంటోంది. అభివృద్ధి, అంతర్గత భద్రత-, సంక్షేమం, రక్షణ రంగాలను ఏకకాలంలో ప్రగతిపథంలో నడిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రయోగించే ఉపగ్రహాలకు కృత్రిమ మేధను జోడించడం వల్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తే... అన్ని ప్రమాదాలను అధిగమించవచ్చు.
- వనకళ్ళ వీరప్ప
జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
