భారత్ వంటి ప్రజాస్వామ్యంలో.. ఎంతో ఎత్తుకు ఎదిగిన పార్టీలకు కూడా అహం, నియంతృత్వం పెరిగినపుడు పతనం తప్పదని ప్రజలు గుర్తుచేస్తుంటారు. అలా మొదలయ్యే పతనం ఆగదు. పాకుడు బండ మీంచి జారినట్టు జారుతూ అట్టడుగున పడిపోవాల్సిందే తప్ప, నడుమ ఆగడానికంటూ ఏమీ ఉండదు. అటువంటి పతనం బీజేపీలో మొదలయిందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జీడీపీ తప్పుడు లెక్కల దుస్సాహసమైనా, రాజ్యాంగాన్ని మారుస్తామనే దూకుడైనా, ఎన్నికలన్నీ గెలిచేస్తామనే అహం అయినా...అవి పతనానికే అన్నది సుస్పష్టం.
లేనిది 7.8 శాతం (జీడీపీ) వృద్ధి రేటు సాధించామనే లెక్కల్ని ఆర్థిక నిపుణులే తప్పుబడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశానికి మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టిన బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. వివిధ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పతనం బీజేపీ నాయకత్వాన్ని వెక్కిరించింది. గ్రహించేవారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రజాక్షేత్రం నుంచి ఇవి స్పష్టమైన సంకేతాలే!
విద్యార్థులు, -యువత ఉద్యమం ఫలితాన్ని సాధించిన పరిణామానికి కొనసాగింపే ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల అనుభవం. సంఖ్యాపరంగా ఉప ఎన్నికలు అక్కడొకటి అక్కడొకటి అన్నట్టే జరిగినా... ఫలితాల్లో, అవి ఇచ్చిన సంకేతాల్లో బోలెడు మతలబుంది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ఆ పార్టీ ఓడిపోయింది. అది కూడా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన జన్‌సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేతిలో! బీజేపీ సర్వశక్తులొడ్డి పోరాడిన మీదట స్పష్టమైన ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థిని పీకే ఓడించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉండి, రాజ్యసభకు వెళుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ రాజీనామా చేసిన స్థానాన్ని పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఓటమి మాత్రమే కాదు కిందటి ఎన్నికలతో పోలిస్తే 29 శాతం ఓటు వాటాను బీజేపీ ఇక్కడ కోల్పోయింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమకు దేశంలో ఎదురే లేదని, ప్రజలు తమవెంటే ఉన్నారని ప్రచారం చేసుకుంటూ విర్రవీగుతున్న బీజేపీకి, బంకీపూర్ ప్రజలు కీలక సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా గుణపాఠం చెప్పారు. ప్రజల సమస్యల్ని విస్మరించి, అహంకారపూరితంగా పాలన సాగిస్తే జనం సరైన సమయంలో ఘాటుగా స్పందిస్తారనడానికి ఇది నిదర్శనం.
మరో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని దతియా ఉప ఎన్నిక ఫలితం కూడా అటువంటిదే! వాళ్లు గొప్పగా ప్రచారం చేసుకునే ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉండి కూడా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ ఇక్కడ గెలువలేకపోయింది. పైగా కిందటి ఎన్నికల నాటికన్నా 7.39 శాతం ఓటు వాటాను అదనంగా కోల్పోయింది. గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, కిందటిసారి ఎన్నికల ఫలితాలతో పోల్చి చూస్తే 8.6 శాతం ఓటు వాటాను కోల్పోయింది. ఇవన్నీ సంకేతాలే, గ్రహిస్తే సరైన పాఠాలే!
నిలకడగా తేడాలు తెలుస్తున్నాయి
ప్రజాస్వామ్యంలో ప్రజలు దేన్నయినా సహిస్తారేమో కానీ పాలకుల అహంకారాన్ని సహించరనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ‘మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంది’ అని మొండిగా, మూర్ఖంగా వ్యవహరించి, అహం ప్రదర్శించి కడకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పట్టువీడి మెట్టుదిగుతున్న సంఘటనలు బీజేపీ పాలనలో పెరుగుతున్నాయి.
జీడీపీ వృద్ధి శాతం 7.8 అయితే ఉద్యోగాల కల్పన, ప్రయివేటు పెట్టుబడులు తత్సమానంగా ఎందుకు పెరగట్లేదు? అనే రఘురామ రాజన్ వంటి ఆర్థిక నిపుణుల ప్రశ్నలకు సమాధానాలేవి? బేస్ ఇయర్ మార్చి, గత ఏట జీడీపీని తగ్గించి చూపి తప్పుడు వృద్ధినే చూపుతున్నారనే మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర ఘర్గ్ విమర్శకు బదులేది? వాస్తవ వృద్ధి రేటు 2.6 శాతాన్ని మించదనేదే వాస్తవం.
ఈ విషయంలోనూ తప్పుడు గణాంకాలకు బీజేపీ నాయకత్వం ఏదోరోజు జాతికి క్షమాపణ చెప్పాల్సే వస్తుంది. అటు మొన్న మూడు వ్యవ సాయ చట్టాల్ని వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణ చెప్పడమైనా, మొన్నటి మహిళా రిజర్వేషన్ అంశాన్ని ‘డీలిమిటేషన్’తో ముడిపెడుతూ రాజ్యాంగ సవరణకు సాహసించి చేతులు కాల్చుకోవడమైనా, నిన్నటికి నిన్న ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారంపై విద్యార్థి, యువజనోద్యమాన్ని కర్కశంగా అణచివేసి, కడకు మంత్రి రాజీనామాతో సహా రాజీకి రావడమైనా... బీజేపీ పాలకుల అహంకారాన్ని ప్రజలు దించేసిన వైనాలే!
ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా రాహుల్ గాంధీ
పార్టీలను నిలువునా చీలుస్తూ, గెలిచిన ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని తమ పార్టీలో కలుపుకుంటూ, ఓటు చోరీలకు పాల్పడుతూ.. ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన ప్రజాస్వామ్య సంస్థల్ని గుప్పిటపట్టి దుర్వినియోగపరుస్తూ బీజేపీ అగ్రనాయకత్వం చేసే నిర్వాకాలు ప్రజల దృష్టికి రాకుండా పోతాయా? పార్టీ అగ్రనాయకులైన నరేంద్ర మోదీ, -అమిత్ షా ద్వయం ప్రత్యక్ష ప్రమేయంతో టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, ఆప్ వంటి పలు రాజకీయ పార్టీలను నిలువునా చీల్చి తమ ఎంపీల మందబలాన్ని పెంచుకుంటున్న తీరును జనం అసహ్యించుకుంటున్నారు.
అందుకు, ఉప ఎన్నికల ఫలితాలే ప్రతీక. మరోవైపు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌గాంధీ ‘ప్రేమమయ- ప్రజాస్వామ్య’ వ్యవహార శైలిని ప్రజలు గత కొన్నేళ్లుగా పరిశీలిస్తున్నారు. బీజేపీ, దాని మాతృక ఆర్ఎస్‌ఎస్, ఇతర అనుబంధ విభాగాలు సాగిస్తున్న దుష్ప్రచారాలు క్రమంగా దూది పింజల్లాగా తేలిపోతున్నాయి. బీజేపీ అగ్రనేతలు అహం, నియంతృత్వం రుజువవుతుంటే, మరోపక్క ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్మ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీ ప్రతిష్ట క్రమంగా ఇనుమడిస్తోంది.
పరిశీలకుల భావన ఓ సంకేతమే!
మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పును సూచిస్తున్నాయని వైవిధ్య నేపథ్యమున్న పరిశీలకులు పేర్కొన్నారు. ఈ ఫలితాలకు ముందు, వెనక చేసిన తమ వ్యాఖ్యానాల్లో ఈ విషయాన్ని వారు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. ‘బంకీపూర్‌లో కుక్కను నిలబెట్టినా బీజేపీ గెలిపించుకుంటుంది’ అని వ్యాఖ్యానించిన కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాటల్ని ప్రజలు ఎలా, నెరవేరని ఆశలుగా తిప్పికొట్టారో కొందరు పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
బీజేపీ అగ్రనాయకుడు, ప్రధాని మోదీ గురించి ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ గతంలో చేసిన వ్యాఖ్యల్ని నేనిక్కడ గుర్తు చేస్తాను. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాభావికంగా నిరంకుశవాది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఇటువంటి ప్రవృత్తి ఉండటం ఎంతమాత్రం తగదు. స్వాభావికంగా నిరంకుశుడు అయిన నాయకుడు ఒక ప్రజాస్వామ్య పాలకుడుగా పరిణమిస్తారా? ఈ పుణ్యభూమిలో తాను భగవంతుడి ప్రతినిధినని చెప్పుకున్న వ్యక్తి తననుతాను మానవమాతృడిగా పరిగణించుకుంటారా? తానూ తప్పులు చేస్తానని అంగీకరిస్తారా?.
నిరంకుశత్వానికి తావు లేదు
పార్లమెంటులో సొంత సంఖ్యాబలం లేని ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ, తన కేబినెట్ సహచరులకు మరింత అధికారాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తారా? ప్రతిపక్షాన్ని సమాదరించి పాలనలో దాని సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతారా? తన పార్టీ పాలనలో లేని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను గౌరవిస్తారా? జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే సమాధానాన్ని ఇవ్వాల్సిన ప్రశ్నలివి.
ఈ సమాధానాలు వెల్లడయ్యేందుకు తప్పక కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అందుకు ఆశాభావంతో వేచివుందాం’ అంటారు రామచంద్ర గుహ! ప్రజాస్వామ్యంలో అహానికి, నిరంకుశత్వానికి తావు లేదు. అవి పతాకస్థాయికి చేరినపుడు ఎంత పెద్ద పార్టీలయినా పతనమవుతాయి. ఎంత బలమైన ప్రభుత్వాలయినా కుప్పకూలుతాయి. ఎంతటి పేరున్న మహానాయకులైనా మట్టిలో కలుస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం!
- పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
