- 40 ఎంజీడీల సరఫరాకు నిర్ణయం
- ‘భగీరథ’తో ఆదా అయ్యే నీళ్లు వెస్ట్ సిటీకి...
హైదరాబాద్‌సిటీ, వెలుగు : సిటీలో తూర్పు వైపున పెరుగుతున్న నీటి సమస్య నివారణకు వాటర్‌బోర్డు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తోంది. ఆయా ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలుస్తుండడం, పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో మిషన్ భగీరథ పనులు పూర్తి కావస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సేకరించే నీటిని తూర్పు నగరానికి సరఫరా చేసేందుకు వాటర్ బోర్డు ప్లాన్‌రెడీ చేస్తోంది.
మిషన్‌భగీరథ ద్వారా బోర్డుకు 40 ఎంజీడీల నీళ్లు రానున్నాయి. ఈ నీళ్లను తూర్పు వైపున ఉన్న ఉప్పల్, కాప్రా, ఎల్ బీ నగర్ లోని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీని కోసం అంతర్గత పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కొత్త పైప్ లైన్లు, ప్రధాన జంక్షన్లు, కంట్రోల్ వాల్స్, పంపింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.
కృష్ణా, గోదావరి నీళ్లు ఆదా
ఈస్ట్ సిటీలో మిషన్‌భగీరథ నీటిని సరఫరా చేస్తే ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి నీళ్లు ఆదా అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా ఆదా అయిన నీళ్లను తీవ్ర నీటి ఎద్దడి ఉన్న వెస్ట్సిటీకి మళ్లించే ప్రపోజల్కూడా సిద్ధం చేస్తున్నారు.
అంతే కాకుండా నార్త్‌సిటీలో సింగూరు, మంజీరా నుంచి తరలించే నీరు సరిపోకపోవడంతో ఈ ఏరియాలకు కూడా కృష్ణా, గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటికి తోడు గోదావరి నుంచి అదనంగా మరో 10 ఎంజీడీలను సమస్య ఉన్న కాలనీలకు మళ్లించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పంపింగ్స్టేషన్ల కెపాసిటీ పెంచాలని, కొత్త గ్రావిటీ పైప్లైన్లను లింక్‌చేయాలని నిర్ణయించారు.
