- ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్
కరీంనగర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ విమర్శించారు. దేశంలో రోజురోజుకూ వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతోందని, నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల ప్రారంభ సూచికగా ఏర్పాటు చేసిన జెండాను అమర్ జీత్ కౌర్ ఎగురవేయగా, అమరవీరుల స్మారక స్తూపాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసుఫ్అధ్యక్షత జరిగిన ప్రతినిధుల సమభలో ఆమె మాట్లాడారు. మోదీ పాలనలో లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ప్రభుత్వ కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు నిధులు కోత విధించారని ఆరోపించారు. కార్పొరేట్లకు, విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉచితంగా భూములు ఇస్తూ, ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అణచి వేసేందుకే విద్యావంతులపై అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆస్తులను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు, విదేశీ కంపెనీలకు కట్టబెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ప్రపంచ కార్మిక సంఘాల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.శ్రీకుమార్, ఏఐటీయూసీ ఏపీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఉపేందర్, సూర్యం, ఆహ్వాన సంఘం ప్యాట్రన్ కలవేణ శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్ బోస్, గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.నర్సింహ పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం : చాడ వెంకట్ రెడ్డి
మహాసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అనేక హామీలు ఇచ్చి కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురి చేసేందుకు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని ఆరోపించారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
