కరీంనగర్ జిల్లా హుజురాబాద్, సుందరగిరి మధ్య హైలెవల్ బ్రిడ్జి..రూ.6.60 కోట్లు మంజూరు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్, సుందరగిరి మధ్య హైలెవల్ బ్రిడ్జి..రూ.6.60 కోట్లు మంజూరు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా హుజురాబాద్–సుందరగిరి రహదారిలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.60 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండీఆర్ ప్లాన్ 2026–27 కింద నిధులు కేటాయించినట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గడంతోపాటు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. 

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

హైలెవల్ బ్రిడ్జి మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.