భక్తజనసంద్రంగా వేములవాడ..

భక్తజనసంద్రంగా వేములవాడ..
  • శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు
  • దర్శనానికి మూడు గంటలు, కోడె మొక్కులకు 5 గంటల టైం

వేములవాడ, వెలుగు : శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయం భకజనసంద్రంగా మారింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా ఆలయ ధర్మసత్రాలతో పాటు, వేములవాడకు వచ్చే మార్గాలు, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కోడె మొక్కుల కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనానికి మూడు గంటలు, కోడె మొక్కు చెల్లించుకునేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది.

అభిషేకం, అన్నపూజ, నిత్య కల్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన, కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. సోమవారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. మరో వైపు స్వామివారికి తెల్లవారుజామునే వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.