- తొమ్మిది మందికి ఉన్నది ముగ్గురే
- మూడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ
- గైనకాలజిస్టులు లేక డెలివరీలకు బ్రేక్
- జనరల్ ఫిజిషియన్ కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్(సీహెచ్‌సీ)లో డాక్టర్ల కొరత వెంటా డుతోంది. ఇక్కడ మొత్తం తొమ్మిది మంది డాక్టర్లకు గాను ముగ్గురే ఉన్నారు. ఇద్దరు రెగ్యులర్డాక్టర్లు పీజీ చేయడానికి వెళ్లగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్వైద్యులు ఇటీవలే రిజైన్ చేశారు. అలాగే మూడు మెడికల్ ఆఫీసర్పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. దీంతో అందుబాటులో ఉన్న డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. వివిధ సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు అరకొర సేవలతో సరిపెడుతున్నారు. గైనకాలజిస్టులు లేకపోవడంతో డెలివరీలకు మంచిర్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇద్దరు కాంట్రాక్టు డాక్టర్లు రిజైన్
లక్సెట్టిపేటలోని 30 పడకలహాస్పిటల్లో అనస్థీషియన్, గైనకాలజిస్టు, పిడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్, పల్మనాలజిస్ట్తో పాటు ముగ్గురు ఎంబీబీఎస్డాక్టర్లు ఉండాలి. మొన్నటివరకు ఇద్దరు గైనకాలజిస్టుల్లో ఒకరు రెగ్యులర్, మరొకరు కాంట్రాక్ట్ డాక్టర్ ఉండేవారు.
రెగ్యులర్ డాక్టర్ నాగ అఖిల మెటర్నిటీ లీవ్‌లో వెళ్లగా, కాంట్రాక్ట్ డాక్టర్ స్రవంతిరావు రిజైన్ చేశారు. ఇద్దరు పిడియాట్రిషియన్లలో సాయికిరణ్పీజీ చేయడానికి వెళ్లగా, ప్రస్తుతం శ్రీజ ఒక్కరే ఉన్నారు.
కాంట్రాక్ట్బేసిక్పై పనిచేస్తున్న జనరల్ ఫిజిషియన్వంశీకృష్ణ సైతం ఇటీవల రిజైన్ చేసి వెళ్లిపోయారు. పల్మనాలజిస్టుతో పాటు మూడు మెడికల్ఆఫీసర్(ఎంబీబీఎస్) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. జనరల్సర్జన్ హిమబిందు ఉన్నారు. అనస్థీషియన్ శ్రీనివాస్సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సవాల్‌గా మారిన ట్రీట్మెంట్
లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల నుంచి లక్సెట్టిపేట సీహెచ్‌సీకి నిత్యం వందల మంది పేషెంట్లు వైద్యం కోసం వస్తుంటారు. ఇదివరకు రోజూ 300 మంది ఔట్పేషెంట్లు, నెలకు దాదాపు వెయ్యి మంది ఇన్‌పేషెంట్లకు సేవలందించినప్పటికీ.. ప్రస్తుతం డాక్టర్ల కొరత కారణంగా మెరుగైన ట్రీట్మెంట్ అందించడం ఇబ్బందిగా మారింది.
మొన్నటివరకు ఇద్దరు గైనకాలజిస్టులు ఉండడంతో నెలకు 15 నుంచి 20 డెలివరీలు చేశారు. వారిద్దరు మానేయడంతో డెలివరీ కేసులను మంచిర్యాల ఎంసీహెచ్‌కు రెఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. లేదంటే లోకల్‌గా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిందే. గతంలో నెలకు సుమారు 20 పోస్టుమార్టంలు నిర్వహించగా, ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డాక్టర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
