ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక యాప్‌‌ను తెస్తాం.. ఆటో కార్మిక నేతలతో మంత్రులు

ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచేందుకు  ప్రత్యేక యాప్‌‌ను తెస్తాం.. ఆటో కార్మిక నేతలతో మంత్రులు
  • ఓలా, ఉబర్‌‌, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం
  • మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ 
  • ఆటో ఛార్జీల సవరణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం

హైదరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్‌‌, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్‌‌ను ప్రవేశపెట్టే ఆలోచన ఉందని మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఐటీశాఖ మంత్రితో చర్చలు జరిపామని, రవాణా, ఐటీ శాఖల సమన్వయంతో త్వరలోనే ప్రభుత్వ యాప్‌‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. 

సోమవారం సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు వివేక్, పొన్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా ఆటో ఛార్జీల సవరణ చేసేందుకు రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. 

కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలోనే ఛార్జీలు పెంచుతామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అంశాన్ని త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి, శాసనసభలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. 

అసంఘటిత రంగ కార్మికులందరికీ పూర్తిస్థాయిలో సామాజిక భద్రత కల్పించే దిశగా ‘ఇందిరమ్మ పాలసీ’ పేరుతో నూతన బీమా విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఆర్టీసీతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినేలా ఎలాంటి నిర్ణయాలు ఉండబోవని, కార్మికులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. 

ఈవీ ఆటోలకు ప్రోత్సాహం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో ఈవీ ఆటోలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగా 18,766 ఆటోల రెట్రోఫిట్‌‌మెంట్ కోసం ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల సబ్సిడీని నేరుగా అందిస్తామని చెప్పారు. వివిధ శాఖల భాగస్వామ్యంతో ఈ పథకం కోసం రూ.200 కోట్ల మేర నిధులు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. 

గతంలో జీవో ఎంఎస్ నం.263 కింద సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేసులు, గడువు ముగిసిన పర్మిట్ల స్థానంలో అర్హులైన కార్మికులకు కొత్త ఆటో రిక్షా పర్మిట్ కోటాను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అగ్రిగేటర్ విధానంపై రవాణా అధికారులతో కమిటీ వేసి లోతుగా అధ్యయనం చేస్తామని తెలిపారు. 

ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్ నగరంలో అక్రమంగా తిరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని వివరించారు. సమావేశంలో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మికశాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేశ్, అధికారులు, ఆటో కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.