కుత్బుల్లాపూర్, వెలుగు: కారులో చెలరేగిన మంటల్లో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. కొన్ని కెమికల్స్ కారులో లభించడంతో ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కార్తీక్(40) జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి బౌరంపేట్లోని ప్రణీత్ ప్రణవ్ విడోస్లో నివాసముంటూ లాండ్రీ బిజినెస్ చేస్తున్నాడు. 2013లో ఇతడికి ప్రేమ వివాహం జరగ్గా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. భార్య రెండున్నరేళ్లుగా దూరంగా ఉంటోంది. సోమవారం ఉదయం కార్తీక్ తన కారులో రుద్రా కన్స్ట్రక్షన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలోకి వెళ్లాడు. కొద్ది సేపటికే కారులోంచి మంటలు రావడాన్ని వాకర్స్గమనించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి కార్తీక్ పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. మండే స్వభామున్న కెమికల్స్ కారులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్తీక్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
