న్యూఢిల్లీ: మ్యాచ్ ఎలాంటిదైనా ప్రత్యర్థులకు తగినట్లుగా వ్యూహాలు మారుస్తామని ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ అన్నాడు. మ్యాచ్‌ల్లో తమకు ప్లాన్–బి ఉండదని, ప్లాన్–ఎ పైనే నమ్మకం ఉంచుతామన్నాడు. ‘మా బలాలను నమ్ముకుంటూనే ప్రత్యర్థి ఆడే శైలికి తగినట్లుగా ఆటను సర్దుబాటు చేసుకుంటాం. చైనా ఆటగాళ్లు వేగంగా ఆడాలని కోరుకుంటారు. కానీ మలేసియా, ఇండోనేసియా ప్లేయర్ల శైలి వేరుగా ఉంటుంది. వాళ్లకు తగినట్లుగానే కోర్టులో మా ఆట ఉంటుంది. మేం స్మాష్‌లు, క్రాస్ కోర్టు ర్యాలీలపై ఎక్కువగా దృష్టి సారిస్తాం.
నెట్ వద్ద ఆటను మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని సాత్విక్ పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విఫలమైన తర్వాత శారీరక దారుఢ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నామని సాత్విక్, చిరాగ్ అంగీకరించారు. దానివల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చైనాలో ఆడిన మ్యాచ్‌లు అత్యంత కఠినంగా ఉండటం వల్ల టైటిల్ పోరుకు శారీరకంగానూ, మానసికంగానూ సిద్ధమయ్యామని చిరాగ్ వెల్లడించాడు.
చైనా ఓపెన్‌లో తొలి రౌండ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో మూడు గేమ్స్ ఆడాల్సి వచ్చిందని గుర్తు చేశాడు. చైనా ఓపెన్ సాత్విక్ ద్వయానికి పదో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ కాగా, ఈ నెలఖారులో జరగనున్న ఆసియా క్రీడల్లో తమ టైటిల్‌ను కాపాడుకోవడానికి ఇది ఆత్మవిశ్వాసాన్నిస్తుందని భావిస్తున్నారు.
