హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ లాబీలో కొత్తగా నిర్మించిన 'దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాల్'ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొద్దిసేపటి ముందే శాసనసభకు చేరుకున్న సీఎం.. ముందుగా అసెంబ్లీలోని ఆధునీకరించిన తన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం లాబీకి వచ్చి సెంట్రల్ హాల్‌ను రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉభయ సభల సభ్యులకు విరామ సమయంలో ఈ సెంట్రల్ హాల్ ఎమ్మెల్సీల మధ్య ప్రజోపయోగకరమైన, ఆలోచనాత్మకమైన చర్చలకు వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రేవంత్ రెడ్డి సెంట్రల్ హాల్‌లో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ, సీపీఐ సభ్యులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
