రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ గా విజయలక్ష్మి బాధ్యతలు

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ గా విజయలక్ష్మి బాధ్యతలు
  • తొలిసారి మహిళకు అవకాశం ఇవ్వడంపై హర్షం

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్‌ మంత్రి హోదాతో గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభవన్‌లో ఆమెకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఫైల్‌పై సంతకం చేశారు. సీఎం ప్రజావాణి హాల్‌ను ఆమె పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ పదవి తొలిసారి  మహిళకు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని, ఇది బీసీ మహిళలకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్​రెడ్డితో పాటు కాంగ్రెస్​ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కె.కేశవరావు, వి.హనుమంతరావు, మహ్మద్‌ అలీ షబ్బీర్‌, ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తా, డాక్టర్‌ రోహిన్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, ఎంపీలు రేణుకాచౌదరి, పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.