హైదరాబాద్, వెలుగు: ‘ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సమ్మిట్ సన్నాహకాలపై సోమవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు, సీఈఓలు, సీఏక్స్ఓలు, దౌత్యవేత్తలను పెద్ద సంఖ్యలో ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రముఖులకు ఈ–మెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానాలు పంపాలన్నారు. ఫ్యూచర్ సిటీ, ఐటీ, ఏఐ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ తదితర రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రదర్శించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
