హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ కేసులో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్లు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ హాజరుకాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫామ్-1 నోటీసులు అందుకున్న తర్వాత కూడా విదేశాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారని నిలదీసింది. ఉన్నతస్థాయి అధికారులకు కోర్టు ధిక్కరణ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించింది.
అసెంబ్లీ సమావేశాల కారణంగా అధికారులు హాజరు కాలేకపోయారన్న ప్రభుత్వ న్యాయవాది వివరణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం ఆన్‌లైన్‌లోనైనా హాజరు కావచ్చని పేర్కొంది. ఇకపై హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చే పిటిషన్లను సులభంగా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లను హైకోర్టు ముగించింది.
