బీసీల వాటా కోసం ఐక్యంగా పోరాడుదాం ..నిజామాబాద్ జిల్లా ఆలూరులో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

బీసీల వాటా కోసం ఐక్యంగా పోరాడుదాం ..నిజామాబాద్ జిల్లా ఆలూరులో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
  • రిటైర్డ్​ జస్టిస్​ ఈశ్వరయ్య,రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు..
  •  ఐలమ్మ మనుమరాలు శ్వేత సంపత్

 ఆర్మూర్, వెలుగు: బీసీలకు దక్కాల్సిన వాటా, హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడుదామని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో సోమవారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజ్, చాకలి ఐలమ్మ ముని మనవరాలు శ్వేత సంపత్ కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఈశ్వరయ్య మాట్లాడారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, సంక్షేమం విషయంలో మోసం చేస్తోందని ఈశ్వరయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. బీసీలకు న్యాయపరమైన హక్కులు దక్కాలంటే అందరూ ఏకమై న్యాయ పోరాటం చేయాలని సూచించారు.

 బీసీ జనాభా లెక్కలను తక్కువగా చూపిస్తూ అధికార పార్టీ దగా చేస్తోందని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకపోవడానికి ఇదే కారణమన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని ఈశ్వరయ్య అన్నారు. రాజకీయాల్లో బీసీలు రాణించాలంటే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. 

ఏళ్లుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ముక్కెర విజయ్, నిర్వాహకులు లింగం, గంగారం, భోజన్న, నాయకులు యాదాగౌడ్, దమ్మన్నస్వామి, గాండ్ల రాంచందర్, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.