హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మధు కావాలనే మాట్లాడారా..లేక ఆయనతో ఎవరైనా మాట్లాడించారా అని ఆయన ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం క్షమాపణలు చెప్పాని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అనంతరం 22ఏ పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు.
అనంతరం అక్కడే నిలబడి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వాటిని చించివేసి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కింద కూర్చొని నిరసన తెలిపారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని తాము కోరుతున్నామన్నారు.
22ఏ అంశంలో తప్పు జరిగిందని మంత్రి క్షమాపణలు చెప్పారని .. ఈ అంశంలో జరిగిన తప్పులను అధికారులపై మోపుతామంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
