న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ (అధికారికంగా ముగించడం) చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మూడింట రెండొంతుల మెజార్టీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారా అని ప్రశ్నించింది. డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించుకునేందుకే ప్రభుత్వం ఈ జాప్యం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత జైరాం రమేశ్ సోమవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడి నేటికి సరిగ్గా 25రోజులు పూర్తయింది.
అయినప్పటికీ, ఇప్పటి వరకు సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. సాధారణంగా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన 3 నుంచి-4 రోజుల్లోనే సమావేశాల ముగింపు ప్రక్రియ పూర్తవుతుంది. 2026 వర్షాకాల సమావేశాలను ఇంకా సజీవంగానే ఉంచారు. డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించుకోవడానికి లోక్‌సభలో తనకు కావలసిన మూడింట రెండొంతుల మెజార్టీ కోసం హోంమంత్రి ఇంకా పావులు కదుపుతున్నారు. బెదిరింపులు, హెచ్చరికల రాజకీయాలకు కాలం చెల్లిందనే వాస్తవాన్ని ఆయన ఎప్పుడు అంగీకరిస్తారు?’’ అని నిలదీశారు.
