చుక్కల్లోనే చక్కెర ధరలు.. కేజీ రేటు రూ.60 పైమాటే 

చుక్కల్లోనే చక్కెర ధరలు.. కేజీ రేటు రూ.60 పైమాటే 

న్యూఢిల్లీ: పండగ సీజన్ సమీపిస్తున్న వేళ చక్కెర ధరల నుంచి ఉపశమనం దొరికే అవకాశాలు కనిపించడం లేదు.  దీని రేట్లు జులైలో నెలవారీ ప్రాతిపదికన 2.7 శాతం పెరిగాయి. మొత్తం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) పెరుగుదల శాతం 0.9 శాతం మాత్రమే ఉంది.  ప్రస్తుతం షాపుల్లో ధర రూ.60పైనే ఉంది. ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం చక్కెరకే పరిమితం కాకుండా బెల్లం,  స్వీట్లపైనా పడుతోంది.

 పండగ సమయంలో జనం జేబులపై భారం ఎక్కువ అవుతోంది. ఈ ఏడాది జులైలో చక్కెర ధరల  పెరుగుదల 2.73 శాతంగా ఉంది. జూన్ లో ఇది 0.63 శాతంగా ఉండగా, మే లో 0.44 శాతం ఉంది. ఏప్రిల్ లో 0.09 శాతం మాత్రమే పెరిగింది. ఈ భారీ పెరుగుదల వార్షిక ద్రవ్యోల్బణంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 

జులైలో చక్కెర ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 4.92 శాతం ఎక్కువగా ఉన్నాయి. జూన్ లో ఈ వార్షిక ద్రవ్యోల్బణం 2.17 శాతంగా మాత్రమే ఉండేది. మే నెలలో 1.61 శాతంగా, ఏప్రిల్ లో 1.45 శాతంగా నమోదయింది. జులై నాటికి చక్కెర ద్రవ్యోల్బణం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతాన్ని దాటిపోయింది.

మరింత పెరిగే ప్రమాదం

రానున్న నెలల్లో ఈ ధరల ఒత్తిడి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత జులై సమయంలో సుమారు రూ.48 ఉన్న చక్కెర ధర, ఇప్పుడు రూ.60కి పైగా చేరింది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి చక్కెర పంట సాగు గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 0.5 శాతం మాత్రమే తక్కువగా ఉంది. కేవలం శుద్ధి చేసిన చక్కెర మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులు కూడా ప్రియమవుతున్నాయి.
 
జులైలో బెల్లం ధరలు నెలవారీ ప్రాతిపదికన 1.76 శాతం పెరిగాయి. మే, జూన్ నెలల్లో ఇవి సుమారు ఒకశాతం చొప్పున పెరిగాయి. వార్షిక బెల్లం ద్రవ్యోల్బణం జూన్‌లోని 5.31 శాతం నుంచి జులై నాటికి 6.28 శాతానికి పెరిగింది. పాలు కలపని స్వీట్ల ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల జులైలో మిఠాయిల వార్షిక ద్రవ్యోల్బణం 6.08 శాతానికి చేరింది. ఇది గత ఏడు నెలల్లో అత్యధిక స్థాయి కావడం గమనార్హం. 

గతంలో ధరల దడ తక్కువే..

నవరాత్రులు, దసరా నుంచి దీపావళి వరకు సాగే పండగ సీజన్‌‌లో చక్కెర, మిఠాయిలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. గతంలో పండగ డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అధిక ద్రవ్యోల్బణానికి దారితీయలేదు. గత పదేళ్లలో.. 2016, 2021, 2022లో మాత్రమే పండగ సమయంలో చక్కెర ద్రవ్యోల్బణం మునుపటి మూడు నెలలతో పోలిస్తే అధికమయింది. 

మిగిలిన ఏడు సంవత్సరాలలో పండగ సమయంలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. పండగ డిమాండ్ ప్రారంభం కావడానికి ముందే చక్కెర, బెల్లం, స్వీట్ల ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్​లో కలిపే ఇథనాల్​ తయారీకి చెరుకును మళ్లించడం వల్లే చక్కెర ధరలు పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.