వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల పక్షాన పోరాడతానని టీఆర్‍ఎస్ చీఫ్ కవిత అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దెబ్బ తీస్తున్నదని మండిపడ్డారు. సోమవారం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించిన కవిత, హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ నుంచి విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‍పాయ్‍ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం మూడేండ్లలో దాదాపు రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు.
లాతూర్ లెక్కనే కాజీపేటలో ఉద్యోగాలియ్యాలి..
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‍లో అయోధ్యపురం భూ నిర్వాసితులకు మహారాష్ట్ర లాతూర్‍లోని కోచ్ ఫ్యాక్టరీ తరహాలో ఉద్యోగాలివ్వాలని కవిత డిమాండ్ చేశారు. లాతూర్‍లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు 734 మంది భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అయోధ్యపురంలోని రైతులు, భూనిర్వాసితులతో కవిత మాట్లాడుతూ.. ఉద్యోగాలకు ఎంత మంది అర్హులున్నారో తనకు లిస్ట్ ఇవ్వాలని.. వారి తరఫున కేంద్రానికి తాను లేఖ రాస్తానని చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కాజీపేట రైల్వే మ్యాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్ మెయిన్ గేటు ముందు ఆందోళన చేపట్టారు.
వరంగల్ నుంచే టీఆర్‍ఎస్ జైత్ర యాత్ర..
రాబోయే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నుంచి టీఆర్‍ఎస్ జైత్రయాత్ర మొదలుపెడతామని కవిత అన్నారు. హనుమకొండ జిల్లా తరాలపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన ఆమె.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని డివిజన్లలో పోటీ చేస్తుందన్నని చెప్పారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు దుర్మార్గం
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని టీఆర్‍ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సోమవారం గ్రేటర్ వరంగల్ పర్యటనలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల గొంతుపట్టడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కడం దారుణమన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
