హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా వారి చీరలు, జుట్టు పట్టి ఈడ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పేదాకా వదిలిపెట్టేది లేదన్నారు.
మహిళా నేతలపై దాడి చేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ స్పీకర్‌కు మనస్తాపం కలిగితే తాను అనని మాటకు కూడా విచారం వ్యక్తం చేశానని చెప్పారు.
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దుశ్శాసన పర్వం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకొని మహిళలు ముందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసన సభ్యులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుందని, ఉదయం టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు.
ఇదే తరహా టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్‌గాంధీ కూర్చున్నప్పుడు వారిని ఎక్కడా అడ్డుకోలేదని గుర్తుచేశారు. రాహుల్ గాంధీకి ఒక రూల్.. తమకో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. ‘స్పీకర్ ఆదేశాల మేరకే మిమ్మల్ని అడ్డుకుంటున్నాం’ అంటూ పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు.
కేవలం 1,000 రోజుల కాంగ్రెస్ పాలనలోని హామీల వైఫల్యాన్ని, పరిపాలనా వైఫల్యాన్ని సభలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు. దళితులపై రేవంత్‌రెడ్డి దొంగ ప్రేమ వలకబోస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
