- కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్
- దసరా నాటికి 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తి
- శాసన మండలిలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. సోమవారం శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు మహిళా పొదుపు సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్ రుణం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటిదాకా 1.97 లక్షల ఇండ్లు పూర్తి
తొలి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. వీటిలో 3,75,750 ఇళ్లకు లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలు అందజేశామని, 3,28,070 ఇళ్లు నిర్మాణ దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 1,97,537 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని.. దసరా నాటికి 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. గతంలో వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు ఈ విడతలో ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ నెల 20లోగా రెండో విడత మంజూరు చేస్తామన్నారు.
కేంద్రం నుంచి సహకారం లేదు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని పొంగులేటి విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను పలుమార్లు కలిసి తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని కోరినా స్పందన లేదన్నారు.
రాయితీపై సిమెంట్, స్టీల్
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తాను రాయితీపై అందిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలో పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి స్టీల్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై రాయితీపై స్టీల్ అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన అసంపూర్తి 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని, ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పేదలకు ఇల్లు కేవలం నాలుగు గోడలు కాదని, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
