వానాకాలానికి ముందే పంపిణీ పూర్తి
హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లై శాఖ ఒకేసారి వానాకాలం సీజన్‌కు సంబంధించి మూడు నెల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసింది. ఈనెల 5 నాటికి 95.13 శాతం బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసి రికార్డు సృష్టించింది. రేషన్ సరఫరాకు వానాకాలంలో తరచూ ఆటంకాలు వస్తుంటాయి. దీంతో బియ్యాన్ని తీసుకోలేక లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కు సంబంధించిన కోటా బియ్యాన్ని సెప్టెంబర్‌లోగా పంపిణీ చేయాలని ఆదేశించింది. వానాకాలంలో రవాణా సమస్యలు, సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున సివిల్సప్లయ్స్ శాఖ పక్కా ప్రణాళికతో ముందుగానే బియ్యం అందజేసింది.
6,16,806 టన్నుల బియ్యం పంపిణీ..
ఈ మూడు నెలలకు ప్రభుత్వం 6.48 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించగా, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా 6,16,806 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో 99.30 లక్షల మంది లబ్ధిపొందారు. దాదాపు 2.95 కోట్ల లావాదేవీలు జరిగాయి.
బయోమెట్రిక్, ఆన్‌లైన్ పర్యవేక్షణ..
బియ్యం పంపిణీ సజావుగా సాగేందుకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని, ఆన్‌లైన్ పర్యవేక్షణను పటిష్టం చేశారు. ఈ–-పాస్ మిషన్ల ద్వారా బియ్యం పంపిణీ చేయడంతో పారదర్శకత పెరిగింది. గ్రామాలు, వార్డుల స్థాయిలో బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. రేషన్ షాపులతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు అవసరమైన బియ్యాన్ని ఆగస్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేశారు.
