భారత రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి కఠినమైన షాక్ తగలనుంది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానాలతో సరిపెట్టే రోజులు పోతున్నాయి. నేరుగా మీ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సస్పెండ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, డ్రైవర్లలో బాధ్యతను పెంచడానికి ప్రభుత్వం గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
నెగటివ్ పాయింట్స్ ఎలా పనిచేస్తుంది?
ఈ విధానంలో డ్రైవర్, వెహికల్ ఓనర్ ఏ చిన్న ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించినా వారి లైసెన్స్, ఆర్సీ నుంచి పాయింట్లు కట్ అవుతాయి. ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఈ నెగటివ్ పాయింట్లు పోగైతే.. సంబంధిత అధికారులకు ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే సర్వాధికారాలు ఉంటాయి. క్రమశిక్షణతో డ్రైవ్ చేసే మంచి రికార్డు ఉన్న డ్రైవర్లను గుర్తించి ప్రోత్సహించడం.. పదే పదే తప్పులు చేసే డ్రైవర్లకు కఠిన శిక్షలు అమలు చేయడం ఈ పాలసీ అసలు ఉద్దేశం.
మంచి డ్రైవర్లకు ప్రయోజనాలు..
రూల్స్ తూచా తప్పకుండా పాటించే క్లీన్ రికార్డ్ ఉన్న వాహనదారులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రీమియంలలో భారీ డిస్కౌంట్స్, ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌కు సమాజంలో పెద్దపీట వేసినట్లు అవుతుందని, తద్వారా రోడ్లపై ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రైవింగ్ ప్రవర్తన మార్చడానికి..
భారతీయ రోడ్లపై డ్రైవర్ల బాధ్యతారహితమైన ప్రవర్తన పెద్ద సమస్యగా మారిందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశవ్యాప్తంగా 1,600 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఇందులో 24 కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. మరో 112 కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందికి ఈ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ పొందారు కూడా.
భారత్ NCAP 2.0 ..
రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 2027 అక్టోబర్ నుంచి 'భారత్ NCAP 2.0' నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. దీని ద్వారా వాహనాల సంపూర్ణ సేఫ్టీ చైన్ కచ్చితంగా పరిశీలించబడుతుంది. అంతేకాకుండా పాత BS IV వాహనాల కాలుష్యాన్ని అరికట్టేందుకు కేవలం రూ.5వేల ఖర్చుతో రెట్రోఫిట్ చేయగల సరికొత్త ఎమిషన్ కంట్రోల్ డివైస్‌ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ విజయవంతం కాగా.. ఈ పరికరం అమర్చిన పాత వాహనాలు కూడా నేరుగా BS VI స్థాయి ఉద్గారాలను ఇస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
మనదేశంలో ప్రతియేటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అందులో సుమారు లక్షా 80వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు గల యువతే ఉండటం అత్యంత ఆందోళనకరమని గడ్కరీ పేర్కొన్నారు. ఈ మరణాల సంఖ్యను ఏ ధర చెల్లించయినా తగ్గించాలని.. ఇందుకోసం దేశీయ స్టార్టప్‌ల అధునాతన సాంకేతికతను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
