నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరు చెప్పి ఉద్యమాలు, రాజకీయాలు చేసి పదవులు పొందుతున్నారని ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జిల్లా చైర్మన్ రాజేందర్ రెడ్డి విమర్శించారు.
మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మీడియాతో మాట్లాడుతూ పాలమూరుకు నీళ్లు రావడం లేదని, నీటి వాటా హక్కులేని నల్గొండకు అదనంగా నీళ్లు తరలిస్తుంటే ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామన్నారు.
శ్రీశైలం ఆగ్నేయ ప్రాంతంలో రూ.35వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు చేపట్టిందని, ఇప్పటికే రూ.30వేల కోట్లు ఖర్చు పెట్టినా 30 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల పెండింగ్ సాధన సమితి కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల వల్లే కల్వకుర్తి పథకం వచ్చిందని, అసంపూర్తిగానే ఉందన్నారు.
