అమెరికాలో H-1B వీసా, పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఐటీ దిగ్గజం కాగ్నిజంట్.. అలాగే క్లౌడెరా సంస్థల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్లను అమెరికా కార్మిక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పొసిటో ప్రకటించారు. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్ కొత్తగా గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ చేయటానికి వీలు లేదని స్పష్టం చేసింది.
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనుకునే విదేశీ ఉద్యోగులకు 'పీఈఆర్‌ఎం' (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) అనేది అత్యంత కీలకం. ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అమెరికన్ జాతీయ కార్మికులు ఎవరూ అందుబాటులో లేరని, అలాగే విదేశీయులను నియమించడం వల్ల స్థానిక ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులు దెబ్బతినవని యజమాని ఈ ప్రక్రియ ద్వారా నిరూపించాల్సి ఉంది. అయితే ఈ వీసా కార్యక్రమాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో గత జూలైలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగానే కాగ్నిజెంట్‌పై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
భారత టెక్కీలపై ప్రభావం:
అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలకు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న నిపుణులకు పెద్ద ఎదురుదెబ్బే. అమెరికాలో ఎక్కువగా హెచ్-1బీ వీసాలు స్పాన్సర్ చేసే కంపెనీల్లో కాగ్నిజెంట్ ఒకటి. ఇప్పటికే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఏళ్ల క్యూలో తమ వంతు కోసం వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అమెరికా చర్యలు భారతీయ ఆశవహుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి.
ఇండియన్ ఐటీ కంపెనీలకు షాక్:
కాగ్నిజెంట్ చెన్నై మూలాలున్న సంస్థ కావడంతో పాటు.. అక్కడ పనిచేసే వేలాది మంది భారతీయ నిపుణులు పరోక్షంగా ఈ వీసా వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నారు. ఈ పరిణామం కేవలం కాగ్నిజెంట్‌కే పరిమితం కాకుండా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ఇతర పెద్ద భారతీయ ఐటీ దిగ్గజాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కంపెనీలన్నీ కూడా ఇలాంటి యూఎస్ వీసాలపైనే భారీగా ఆధారపడి ఉండటంతో రాబోయే రోజుల్లో వాటిపై కూడా అమెరికా నిఘా మరింత పెరిగే అవకాశం ఉంది.
►ALSO READ | బుధవారం కుప్పకూలిన మన స్టాక్ మార్కెట్లు.. వరుస నష్టాలకు కారణం ఏంటి?
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటున్న వేల మంది భారతీయ టెక్కీలకు ట్రంప్ సర్కార్ చర్యలు కొత్త తలనొప్పిగా మారాయి. అమెరికా వీసా రూల్స్ కఠినతరం చేస్తుండటంతో.. అక్కడి కంపెనీలు విదేశీ ఉద్యోగుల రిక్రూట్మెంట్స్ పట్ల పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కఠిన చర్యల వల్ల భవిష్యత్తులో జాబ్ సేఫ్టీ, కెరీర్ పురోగతిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
