హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో మూడో రోజు (సెప్టెంబర్ 9) రగడ కొనసాగుతోంది. మూడో రోజు శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌ను మండలి చైర్మన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్ పై ఓటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటింగ్‌కు నిరాకరించారు. చైర్మన్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు.. శాసన సభలోనూ గందరగోళం నెలకొంది. సభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి స్పీకర్ సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్
శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి.
హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు.
శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు. సమావేశాలకు అడ్డుపడుతోన్న బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ తీర్మానాన్ని ఆమోదించి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
