బంగారం రేటు భారీగా పెరిగినా ఇండియన్ ఫ్యామిలీస్ ఎందుకు అమ్మట్లే..?

బంగారం రేటు భారీగా పెరిగినా ఇండియన్ ఫ్యామిలీస్ ఎందుకు అమ్మట్లే..?

ధరలు ఆకాశాన్నంటుతున్నా ఇండియన్స్ మాత్రం తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎందుకు అమ్మడానికి ఇష్టపడట్లేదు? సాధారణంగా ఏదైనా వస్తువు రేటు పెరిగితే జనాలు లాభాలకు అమ్ముకోవడానికి పోటీ పడతారు. కానీ భారత్ విషయంలో మాత్రం ఈ సూత్రం పూర్తిగా తలక్రిందులైంది. ధరలు పెరుగుతున్న కొద్దీ పాత బంగారాన్ని రీసైక్లింగ్ కోసం అమ్మేసే వారి సంఖ్య మరింత పడిపోతోంది. అసలు ఈ ట్రెండ్‌ వెనుక ఇండియన్ మిడిల్ క్లాస్ ఆలోచనల గురించి తెలుసుకుందాం రండి..

జూన్ 2026 త్రైమాసికంలో నికర రీసైక్లింగ్ కేవలం 19.2 టన్నులుగా ఉంది. అంతకుముందు మార్చి త్రైమాసికంలో ఇది 31.2 టన్నులుగా ఉండేది. 2025 మొత్తం ఏడాదిలో భారత్ రీసైకిల్ చేసింది కేవలం 92.6 టన్నులే. బంగారం ధరలు చుక్కలను తాకుతున్న సమయంలో అమ్మకాలు తగ్గడం ఆశ్చర్యకరమే అయినప్పటికీ.. దీని వెనుక సెంటిమెంట్, ఆర్థిక వ్యూహం దాగి ఉన్నాయి.

భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించి నగదు తీసుకోవడానికి బదులుగా రెండు మార్గాలను ఎంచుకుంటున్నాయి. మొదటిది గోల్డ్ లోన్స్. బంగారాన్ని అమ్మేసి దానిపై ఉన్న హక్కును కోల్పోవడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. బదులుగా అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అత్యవసర అవసరాల కోసం అప్పులు తీసుకుంటున్నారు. మే 2026 నాటికి బ్యాంకుల్లో రిటైల్ గోల్డ్ లోన్స్ రూ.5 లక్షల కోట్లకు, ఎన్‌బీఎఫ్‌సీలలో రూ.3 లక్షల 30వేల కోట్లకు చేరాయంటే క్రెడిట్ మార్కెట్లో దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెండవది ఎక్స్ఛేంజ్ విధానం. షాపులకు వెళ్లి పాత నగలు ఇచ్చి కొత్త డిజైన్లను కొనుగోలు చేయడం పెరిగింది. కొన్ని చోట్ల రిటైల్ విక్రయాలలో 70 శాతం వరకు పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలా అని బంగారంపై ఉన్న మమకారం పోదు. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయనే నమ్మకంతోనే ఎవరూ తమ దగ్గరి సంపదను శాశ్వతంగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

ALSO READ : బ్యాంకులో రెండున్నర కోట్లున్నాయ్.. 

పాత నగలను అమ్మితే మేకింగ్ చార్జీలు, జీఎస్టీ వంటి ఖర్చులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. కేవలం లోహపు బరువు, స్వచ్ఛతకు మాత్రమే డబ్బులు వస్తాయి. అందుకే అమ్మేయటం కంటే దానిని తాకట్టు పెట్టడమే మేలని అనుకుంటున్నారు. ఏదేమైనా భారతీయులకు బంగారం అనేది కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక రక్షణ కవచం. అందుకే రేట్లు ఎంత పెరిగినా సొంత బంగారాన్ని వదులుకోవడానికి మన దేశంలోని ప్రజలు ఏమాత్రం ఇష్టపడటం లేదు.