స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి..నిన్న జరిగిన ఘటన క్షమించరానిది: అక్బరుద్దీన్ ఓవైసీ

స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి..నిన్న జరిగిన ఘటన క్షమించరానిది: అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఘటన క్షమించరానిదన్నారు.

దశాబ్దాలు గడిచినా దళితులపై చిన్నచూపు పోకపోవడం బాధాకరమని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సభలో స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని ప్రతి సభ్యుడు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

తప్పు చేస్తే క్షమాపణ చెప్పడంలో సిగ్గు లేదు

తాను కూడా గతంలో ఎన్నోసార్లు నోరుజారి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అయితే తన మనసుకు తప్పు చేశానని అనిపించినప్పుడు క్షమాపణ కోరానని చెప్పారు.తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పేందుకు ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదని అక్బరుద్దీన్ అన్నారు. చేసిన తప్పును అంగీకరించి క్షమాపణ కోరడం బాధ్యతగా భావించాలని సూచించారు.

ALSO READ : స్పీకర్ కన్నీళ్లు పెట్టుకుంటే బాధేసింది .. 

తాతా మధు తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోని ప్రతి తల్లికి క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సభలో చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని అన్నారు.నిన్నటి ఘటనతో స్పీకర్ మనసుకు బాధ కలిగినప్పటికీ, నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం గర్వించదగ్గ విషయమని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. సభలో ఎంతటి విభేదాలు ఉన్నా స్పీకర్ స్థానానికి, శాసనసభ గౌరవానికి భంగం కలగకుండా సభ్యులు వ్యవహరించాలని ఆయన సూచించారు.